మహిళా నేతలూ మొదలుపెట్టేశారా ?
తెలంగాణా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మాట్లాడుతు మహిళలకు కచ్చితంగా 20 టికెట్లు ఇవ్వాల్సింది అని డిమాండ్ వినిపించారు.
రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తాజాగా మహిళా నేతలు కూడా గొంతు విప్పారు. ఇంతకాలం వీళ్ళొక్కళ్ళే డిమాండ్లు వినిపించటం లేదేమిటబ్బా అని అందరు అనుకుంటున్నారు. తాజా డెవలప్మెంట్ తో ఆ ముచ్చట కూడా తీరిపోయింది. తెలంగాణా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మాట్లాడుతు మహిళలకు కచ్చితంగా 20 టికెట్లు ఇవ్వాల్సింది అని డిమాండ్ వినిపించారు. ఇదే విషయమై అధిష్టానంతో మాట్లాడేందుకు తొందరలోనే ఢిల్లీకి వెళ్ళబోతున్నట్లు చెప్పారు.
119 నియోజకవర్గాల్లో సుమారు 60 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు చాలా ఎక్కువున్నట్లు సునీత చెప్పారు. మహిళా ఓటర్లు ఎక్కువున్న నియోజకవర్గాల్లో మహిళా అభ్యర్ధులకు టికెట్లు ఇవ్వాల్సిందే అని అధిష్టానాన్ని కోరబోతునట్లు ఆమె చెప్పారు. తక్కువలో తక్కువ 20 నియోజకవర్గాల్లో మహిళా నేతలకు టికెట్లు ఇవ్వాల్సిందే అని సునీత డిమాండ్ చేస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు అవకాశం ఇవ్వటం ద్వారా పార్టీ ఇమేజ్ పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గదన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుతో సంబంధంలేకుండానే తమకు కొన్ని టికెట్లు కేటాయించాల్సిందే అని సునీత డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని అగ్రనేతలతో చెప్పటానికి ఢిల్లీ యాత్రకు రెడీ అవుతున్నారు. దాదాపు నెలన్నర క్రితం కేసీయార్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్ధుల్లో ఏడుగురు మాత్రమే మహిళలున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంతమంది మహిళా నేతలకు టికెట్లు ఇస్తుందో ఎవరికీ తెలీదు. నిజానికి అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేయటానికి గట్టి అభ్యర్ధులే బీజేపీకి లేరు. ఈ పరిస్ధితుల్లో మహిళా నేతలకు టికెట్లిచ్చే విషయాన్ని ఇక పార్టీ నాయకత్వం ఏమి ఆలోచిస్తుంది ?
కాబట్టి ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ నుండి ఎక్కువమంది మహిళలకు టికెట్లు కేటాయిస్తే మహిళా ఓట్లు అత్యధికంగా పార్టీకి పడే అవకాశం ఉందన్నది సునీత లాజిక్. మరి అధ్యక్షురాలి డిమాండును ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణా ఇన్చార్జి మాణిక్ రావు థాక్రే అంగీకరించాలి. అయినా ఇంతకాలం ఏమీ మాట్లడని సునీత సడెన్ గా ఇప్పికిప్పుడు మహిళలకు 20 టికెట్లు కేటాయించాల్సిందే అనంటే అధిష్టానం అంగీకరిస్తుందా అన్నది పెద్ద సందేహం. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.