రజినీకాంత్‌ పై మరోసారి రోజా సంచలన వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో ఇటీవల జైలర్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ లో రజినీకాంత్‌ పరోక్షంగా తనను విమర్శిస్తున్నవారిపై తనదైన పంచ్‌ లతో విరుచుకుపడ్డారు

Update: 2023-09-04 10:37 GMT

ఇటీవల తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ విజయవాడలో జరిగిన టీడీపీ కార్యక్రమానికి హాజరై టీడీపీ అధినేత చంద్రబాబుపై పొగడ్తలు కురిపించిన సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో ఎక్కడా రజినీకాంత్‌ వైసీపీ నేతల గురించి కానీ, ప్రభుత్వ పాలన గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అయినప్పటికీ వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రజినీకాంత్‌ ను తిట్టిపోశారు. రజినీకాంత్‌ సినిమాల్లోనూ జీరోనే అని, పాలిటిక్స్‌ లోనూ జీరో అయ్యారని ఎద్దేవా చేశారు.

రజినీకాంత్‌ పై వ్యాఖ్యలు చేసినవారిలో వైసీపీ మంత్రి ఆర్కే రోజా కూడా ఉన్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని విమర్శించారు. రజనీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందని రోజా వ్యాఖ్యానించారు. రజినీకాంత్‌ తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజనీకాంత్‌ కు వీడియోలు ఇస్తానని రోజా తెలిపారు. ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్‌ మాట్లాడారంటూ ఆమె దుయ్యబట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇటీవల జైలర్‌ ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ లో రజినీకాంత్‌ పరోక్షంగా తనను విమర్శిస్తున్నవారిపై తనదైన పంచ్‌ లతో విరుచుకుపడ్డారు.. 'మొరగని కుక్క.. విమర్శించని నోరు లేవు.. ఈ రెండూ లేని ఊరే లేదు.. అర్థమైందా రాజా' అంటూ తమిళంలో ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. తనను విమర్శించిన వైసీపీ నేతలనే దృష్టిలో ఉంచుకుని రజినీకాంత్‌ వ్యాఖ్యలు చేశారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌ రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరికి వచ్చారు. జగనన్న విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రోజా.. రజినీకాంత్‌ వేసిన పంచ్‌ లను చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కళ్యాణ్‌ లకు ఆపాదిస్తూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అప్పట్లోనే రోజాపై విమర్శలు వచ్చాయి. టీడీపీ, జనసేన శ్రేణులు రోజాను టార్గెట్‌ చేసుకున్నాయి. రజినీకాంత్‌ అన్న ఆ కుక్కలు వైసీపీ వారేనని.. ఆ విషయాన్ని మరిచిపోయి రోజా కవరింగులు, కవరప్‌ లు ఇస్తోందని మండిపడ్డారు.

జైలర్‌ సినిమా బ్లాక్‌ బస్టర్‌ కావడంతోపాటు రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం తమిళనాడును ఆనుకుని ఉంటుంది. తమిళులు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్‌ అభిమానులు రోజాను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉండటంతో రోజా స్పందించారు.

తాను రజినీకాంత్‌ ను విమర్శించలేదని.. ఆయన వ్యాఖ్యలను ఖండించానని మాత్రమే రోజా వివరణ ఇవ్వడం గమనార్హం. రజనీకాంత్‌ ఎవరినో ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదిస్తూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారని రోజా తెలిపారు.

లోకేష్‌ పాదయాత్ర చేస్తూ ప్రతి నియోజకవర్గంలో మొరుగుతున్నాడని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ షూటింగ్‌ గ్యాప్‌ లో చంద్రబాబు ఇచ్చిన ఫ్యాకేజీ తీసుకుని తమపై విమర్శలు చేస్తున్నాడంటూ ఆరోపించారు. ఐటీ నోటీసులపై చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు.

అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రహ్మిణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేష్‌ ని విచారించి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు.. టీడీపీ కొత్త పాలకమండలిపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కేసులు పెట్టగానే వారు నేరచరిత్రులు కాదన్నారు. వారిని పాలకమండలిలో నియమిస్తే టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News