చంద్రబాబు కేసుపై పిటీషన్ : సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
ఏపీ సీఎం చంద్రబాబుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై నమోదైన సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు న్యాయవాది బాలయ్య దాఖలు చేసిన పిటిషన్ పూర్తిగా తప్పుడుదని భావించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ పై ఒక్కమాట మాట్లాడినా జరిమానా విధిస్తామంటూ హెచ్చరించింది.
ఏపీ సీఎం చంద్రబాబుపై నమోదైన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టు న్యాయవాది బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషన్ వాదనలను తోసిపుచ్చింది. ఇది పూర్తిగా తప్పుడు పిటిషన్ గా భావిస్తున్నామని న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. ఇలాంటి పిటిషన్లను కూడా మీరు వాదిస్తారా? అంటూ పిటిషనర్ తరఫు వకల్తా పుచ్చుకున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ ను నిలదీశారు. ఇలాంటి కేసుల్లో మీలాంటి సీనియర్లు హాజరవుతారని అస్సలు ఊహించలేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఒక్కమాట కూడా మాట్లాడొద్దంటూ పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా, ఆయనపై స్కిల్ కేసు నమోదు చేసిన వైసీపీ ప్రభుత్వం 53 రోజుల పాటు జైలులో నిర్బంధించింది. ఆ తర్వాత ఎడాపెడా కేసులు నమోదు చేస్తూ అన్నింటిని దర్యాప్తు చేయాల్సిందిగా సీఐడీని ఆదేశించింది. అయితే విచారణలో ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో చంద్రబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత రాజకీయ పరిణామలతో చంద్రబాబు ఏపీలో ఘన విజయం సాధించారు. అయితే ఆయన కేసులను సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు కొట్టివేసింది.