మార్గదర్శి కేసులో జగన్ ప్రభుత్వానికి కొత్త కష్టం వచ్చిందని తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీకి కేసుల బదిలీ చేయాలని వైసీపీ ప్రభుత్వంపై వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
అవును... మార్గదర్శి కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకి కేసుల బదిలీ చేయాలని వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అలా బదిలీ చేయడానికి కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
ఇదే సమయంలో మార్గదర్శి కేసులను విచారించే న్యాయ పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదనే ఏపీ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఫలితంగా... న్యాయపరిధి అంశాన్ని తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇదే క్రమంలో... మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ పై కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అదేవిధంగా... ఇప్పటికే మార్గదర్శిపై విచారణ జరిగిన కారణంగా, మళ్లీ విచారణ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో ఉన్న మెరిట్స్ ఆధారంగా తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. చెప్పాలనుకున్న విషయాలన్నీ తెలంగాణ హైకోర్టుకే తెలపాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులకు సూచించింది. ఇదే సమయంలో... హైకోర్టు తుది ఆదేశాలు వెలువడిన తర్వాత సుప్రీంకోర్టుకు రావొచ్చని తెలిపింది.