ఎస్సీ వర్గీకరణకు.. అడుగులు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
తాజాగా దీనిపై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ ఎలా చేపట్టాలి?
ఎస్సీ వర్గీకరణ. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్న డిమాండ్ ఇది. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు కూడా.. ఈ డిమాండ్ వినిపించింది. వినిపిస్తోంది. అయితే.. దీనిని సానుకూలంగా తీసుకునే వారు.. తీసు కోని వారు రెండు విభాగాలుగా విడిపోయారు. దీంతో ఇది ఎప్పటికప్పుడు చర్చలకే పరిమితం అయిపోతోంది. ఎన్నికల సమయంలో పార్టీలకు మాత్రం ప్రచార వనరుగా మారింది. ఇలాంటి ఎస్సీ వర్గీకరణను ఏదో ఒకటి తేల్చేస్తామని.. హైదరాబాద్ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
అనుకున్నట్టుగానే ఆయన దీనికి సంబంధించి అడుగులు వేస్తున్నారు. తాజాగా దీనిపై దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ ఎలా చేపట్టాలి? ఏ విధంగా ముందుకు సాగాలి? ఏయే రాష్ట్రాల్లో ఎస్సీల రిజర్వేషన్లు ఎవరికి అందుతున్నాయి? ఏయే వర్గాల నుంచి డిమాండ్ ఉంది? అనే కీలక విషయాలపై తాజాగా రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఇది నిజంగానే సంచలనమనే చెప్పాలి.
ఈ రాజ్యాంగ ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం వహించనున్నారు. మిగిలిన వారిలో ఏడుగురు న్యాయమూర్తులు ఉంటారు. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉంటా రు. ఎస్సీవర్గీకరణకు సంబంధించి కొన్నేళ్ల కిందటే పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తర్వాత.. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలు కూడా వర్గీకరణ విషయాన్ని ఏదో ఒకటి తేల్చాలని.. కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటషన్ వేశాయి.
వీటిలో పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనం స్వీకరించనుంది. అదేవిధంగా వ్యతిరేకంగా, అనుకూలంగా దాఖలైన పిటిషన్లను కూడా విచారించనుంది. ఇదిలావుంటే.. తాజాగా మంగళవారం జరిగిన విచారణకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, తెలంగాణ మంత్రి, ఎస్సీ నేత దామోదర రాజనరసింహలు పాల్గొని.. తమ వాదనలు వినిపించారు.