'ఆర్-5' జోన్‌లో ఏం జరుగుతోందో మాకు తెలుసు: సుప్రీం హాట్ కామెంట్స్
తాజాగా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం.. 'ఆర్-5' జోన్‌లో ఏం జరుగుతోందో తమకు తెలుసునని వ్యాఖ్యానించింది.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్ల విషయంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్‌లో పేదలకు గత ఏడాది ఇంటి పట్టాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఆ సమయంలో ఆయా పట్టాలకు సంబంధించి పత్రాలపై 'కోర్టు తీర్పునకు లోబడి' అని రాసి ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఈ విషయంపై రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం.. 'ఆర్-5' జోన్‌లో ఏం జరుగుతోందో తమకు తెలుసునని వ్యాఖ్యానించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆర్-5పై విచారణ జరిపింది. అయితే.. ఆర్-5 జోన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణను వెంటనే ఏప్రిల్‌కు వాయిదా వేసింది. అయితే.. ఈ విషయం లో తక్షణం జోక్యం చేసుకుని పిటిషన్లపై విచారణ జరపాలంటూ ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. ఇది అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. కానీ, ఆయన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. అంతేకాదు.. ఏప్రిల్‌లో 'నాన్ మిస్‌లేనియస్ డే'(అంత ఇంపార్టెంట్ కేసులు లేనప్పుడు) తుది విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
రాజధాని అమరావతికి సంబంధించిన ప్రధాన పిటిషన్ ఇదే ధర్మాసనం ముందు పెండింగ్‌లో ఉందని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ప్రభుత్వం తరఫున సింఘ్వీ వాదనలు వినిపిస్తూ పేదలకు సెంటు భూమి ఇచ్చి నివాస గృహాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారని చెప్పారు. దీనివల్ల అర్హులైన పేదలు మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ''ఆర్-5లో ఏం జరుగుతోందో మాకు తెలుసు'' అని వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు ఇబ్బందేనా?
ఇక, తాజా పరిణామాలతో అధికార పార్టీ వైసీపీకి ఎన్నికలకు ముందు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.