ట్రంప్ కు సుప్రీం బిగ్ షాక్... కారణం ఇదే!
రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది.
అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. 2024 లో అక్కడ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోపాటు ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. వీరిలో రామస్వామి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారని కథనాలొస్తున్నాయి. ఇక ప్రీపోల్ సర్వేల్లో డొనాల్డ్ ట్రంప్ పైచేయి సాధిస్తూ వస్తోన్నారు. ఈ సమయంలో ట్రంప్ కు సుప్రీం బిగ్ షాక్ ఇచ్చింది!
అవును... అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి షాక్ తగిలింది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడంటూ కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో వైట్ హౌస్ కు రెండోసారి చేరుకోవాలన్న ట్రంప్ ఆశలకు ఈ తీర్పు బ్రేకులు వేసింది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నాయకుడిపై ఇలా అనర్హత పడటం అగ్రరాజ్యం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడి కేసే కారణం!:
అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, 2020 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషనే ప్రధాన కారణమంటూ 2021 జనవరి 6వ తేదీన ఆయన మద్దతుదారులు వాషింగ్టన్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ ర్యాలీ సందర్భంగా మద్దతుదారులు యూఎస్ పార్లమెంట్ భవనంపై దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించారు.
దీంతో ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం ట్రంప్ అనడానికి సాక్ష్యాలున్నాయని కోర్టు వెల్లడించిందని తెలుస్తుంది. ఈ క్రమంలో... ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో... అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3 నిబంధన ప్రకారం.. ఆయన ప్రాథమిక ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది.
ఈ క్రమంలో 4-3 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించిన కొలరాడో సుప్రీంకోర్టు... దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ కు అవకాశం కల్పించింది. అందువల్ల వచ్చే ఏడాది జనవరి 4 వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తాజా తీర్పుపై ట్రంప్ అటార్నీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైంది. అంటే.. ట్రంప్ భవితవ్యాన్ని ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది!
కాగా... 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ట్రంప్ ప్రేరేపించినట్లు గతంలో కొలరాడోలోని ఓ జిల్లా కోర్టు కూడా ధ్రువీకరించింది. అయితే, ఆ కారణంతో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిషేధించాల్సిన అవసరం లేదని తీర్పు వెలువరించింది. అయితే, ఆ తీర్పును తజాగా కొలరాడో ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.