ఇప్పటికి వనమానే కొత్తగూడెం ఎమ్మెల్యే..? అనర్హత పై సుప్రీం స్టే

కొత్తగూడెం ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్లిన వనమా వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది.

Update: 2023-08-07 09:23 GMT

కొత్తగూడెం ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్లిన వనమా వెంకటేశ్వరరావుకు భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు తీర్పు పై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఆయన పై వేసిన కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో కౌంటర్ వేయాలని కోరింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ లెక్కన సెప్టెంబరు రెండో వారంలో విచారణ జరగనుంది.

15 రోజుల్లో ఎన్నో పరిణామాలు.

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ జూలై 25న తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పే పెద్ద సంచలనం. అందులోభాగంగా వనమా చేతిలో ఓడిన, పిటిషనర్ జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఆయనను 2018 డిసెంబరు 12 నుంచి.. అంటే ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి ఎమ్మెల్యేగా పేర్కొంది. కాగా, తప్పుడు వివరాలతో వాస్తవాలను దాచి ఎన్నికల అఫిడవిట్‌ ఇచ్చినందుకు వనమాకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. జలగం ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది.

ఓడి గెలిచి ఓడి

2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు వనమా. జలగం పై గెలుపు అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. అయితే, ఆయన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని, ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి, రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ అనంతరం వనమా ఎన్నిక చెల్లదంటూ తీర్పు చెప్పింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా.. వనమా ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వం పై వేటుపడినా ఆ పార్టీకి సభ్యుల సంఖ్య ఏమీ తగ్గదు. ఎందుకంటే.. రెండో స్థానంలో నిలిచిన జలగం ను హైకోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది.

అసెంబ్లీకి ఇద్దరూ రాలే..

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవి ప్రారంభానికి కొద్దిగా ముందే వనమా ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు వచ్చింది. జలగంను ఎమ్మెల్యేగా ప్రకటించింది. కానీ, అసెంబ్లీ సమావేశాలకు వనమా, జలగం ఇద్దరూ రాలేదు. వాస్తవానికి హైకోర్టు తీర్పు పై వనమా మరోసారి ప్రయత్నించినా ఊరట దక్కలేదు. దీంతో జలగంతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలి. అలా ఏమీ చేయలేదు. ఈలోగా సుప్రీం కోర్టుకెళ్లిన వనమాకు ఊరట దక్కింది.

మంగళవారంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. వాస్తవానికి అయితే సోమ లేదా మంగళవారం జలగంతో స్పీకర్ ప్రమాణం చేయించాల్సి. అలాచేయక ముందే సుప్రీం తీర్పు వచ్చింది. అన్నిటికి మించి కేసు విచారణను నాలుగు వారాలు (అంటే దాదాపు నెల) వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఆపై కూడా విచారణ జరిగేందుకు సమయం పడుతుంది. తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం డిసెంబరు రెండో వారంతో ముగియనుంది. ఆలోగా సుప్రీంలో విచారణ పూర్తయి ఏం తీర్పు వస్తుందో చూడాలి.

Tags:    

Similar News