ఆదిలోనే హంసపాదు... బీజేపీ - జనసేన పొత్తులో కొత్త చిచ్చు!

ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి సీట్లు జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో... ఈ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని స్థానిక బీజేపీ అభ్యర్థులు గట్టిగా చెబుతున్నారట.

Update: 2023-10-30 06:58 GMT

తెలంగాణలో ఎన్నికల సందడి పీక్స్ కి చేరుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అధికార బీఆరెస్స్, ప్రతిపక్ష కాంగ్రెస్ లు ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. అధికార బీఆరెస్స్ కు తామే ప్రత్యామ్నాయం అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో... జనసేనతో కలిసి వెళ్లబోతోన్న బీజేపీకి... పొత్తు వ్యవహారంలో కొత్తచిక్కులు వచ్చిపడుతున్నాయని అంటున్నారు.

అవును... తెలంగాణ ఎన్నికలో జనసేనతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న బీజేపీ... సీట్ల సర్ధుబాట్ల విషయంలో కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటుందని అంటున్నారు. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని పలువురు బీజేపీ అభ్యర్థులు తేల్చి చెబుతున్నారంట. దీంతో, జనసేనతో పొత్తు వ్యవహారం కొత్త చిచ్చుకు కారణమవుతోందనీ అంటున్నారు పరిశీలకులు.

వాస్తవానికి జనసేన తెలంగాణలో 32 స్థానాలకు పోటీ చేయాలని తొలుత నిర్ణయించినట్లు ప్రకటించి.. ఆ నియోజకవర్గాల పేర్లు మాత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు మద్దతు కోసం పవన్ తో చర్చలు జరిపారు. అనంతరం ఢిల్లీలో పవన్ కు నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో... బీజేపీ - జనసేనలు కలిసి సీట్ల గురించి కలిసి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు.

అయితే ఈ విషయంలో ఇద్దరిమధ్యా చర్చలు ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. సీట్ల విషయంలో జనసేన పట్టుబట్టడమే దీనికి కారణం అని తెలుస్తుంది. ఈ క్రమంలో తమకు కనీసం 20 సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబడుతుండగా.. బీజేపీ మాత్రం 6 సీట్లు ఇచ్చేందుకు సిద్దం అవుతోందని సమాచారం. ఈ సీట్ల సంఖ్య ఒక కారణం కాగా.. శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి స్థానాల అంశం కూడా మరో కారణం అని తెలుస్తుంది. దీంతో చర్చలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు.

ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్‌ పల్లి సీట్లు జనసేనకు కేటాయిస్తారంటూ ప్రచారం సాగుతోన్న నేపథ్యంలో... ఈ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని స్థానిక బీజేపీ అభ్యర్థులు గట్టిగా చెబుతున్నారట. అయితే... టీడీపీ కూడా ఎన్నికల బరిలో లేకపోవటంతో సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గాలలో జనసేనకు ప్లస్ అవుతుందని ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నారంట. అయితే... బీజేపీ నేతలు మాత్రం అందుకు ఏమాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.

చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి సీటు రవికుమార్ యాదవ్ కు ఇవ్వాలని ఆ పార్టీ నేత కొండా విశ్వేశ్వర పట్టుపడుతున్నారట. ఇదే సమయంలో... కూకట్‌ పల్లి సీటును జనసేనకు ఇచ్చే ప్రతిపాదనను స్థానిక నేతలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. దీంతో.. జనసేనతో పొత్తు వల్ల కలిగే ప్రయోజనం సంగతేమో కానీ... సీట్ల కేటాయింపులతో పార్టీలో అంతర్గత సమస్యలు, అధినాయకత్వానికి కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయని!

కాగా... ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటలీలో ఉన్నారు. మరోపక్క నవంబర్ 1 న బీజేపీ తుదిజాబితా విడుదల చేసే అవకాశం ఉందని.. ఇప్పటికే ఆలస్యం అయ్యిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... జనసేన - బీజేపీ పొత్తు బంధం ఏలాంటి క్లైమాక్స్ ఇస్తుందనేది వేచి చూడాలి!

Tags:    

Similar News