పాతతరం రాజకీయాలు గుర్తు చేసిన తమిళి సై!
అధినేతల మెప్పుకోసం.. ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలపై రాళ్లు రువ్వి.. విమర్శలు చేసి బూతులు తిట్టి సైకోల్లా ప్రవర్తించిన నాయకులు కూడా ఉన్నారు.
నేటి రాజకీయాలు అంటే.. అందరికీ తెలిసిందే. ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడడం.. వారిపై విమర్శలతో చిందులు తొక్కడం, వ్యక్తిగత కుటుంబ విషయాలను కూడా నడిరోడ్డుపైకి లాగి హేళన చేసి ఆనందించడం వంటివి ఏపీ వంటి రాష్ట్రాల్లో కామన్ అయిపోయాయి. అధినేతల మెప్పుకోసం.. ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలపై రాళ్లు రువ్వి.. విమర్శలు చేసి బూతులు తిట్టి సైకోల్లా ప్రవర్తించిన నాయకులు కూడా ఉన్నారు. అయితే.. ఓ 15, 20 ఏళ్ల వెనక్కి వెళ్తే.. రాజకీయాల్లో హుందా తనం ఉండేది. ప్రత్యర్థులుగా ఉన్న వారు కూడా విలువలను కాపాడుకునేవారు. పరస్పరం గౌరవించుకునేవారు.
''రాజకీయంగా ప్రత్యర్థులమే కానీ.. మనుషులుగా కాదు. ముందు మనుషులం. తర్వాతే రాజకీయ నేతలం'' అని కొందరు అంటే.. మరికొందరు.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు తప్ప.. ఇతర సమయా్ల్లో ప్రజల కోసం కలిసి పనిచేస్తామని చెప్పిన నాయకులు కూడా ఉన్నారు. అయితే.. ఇంత మంచి రాజకీయ రోజులు ఎప్పుడోకనుమరుగయ్యాయి. ప్రధాన పార్టీల నాయకులు కూడా.. ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ జరిగితే.. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అడుగు కూడా పెట్టలేదు. తనకు దక్కాల్సిన అధికారం తన ప్రత్యర్థి రేవంత్‌కు దక్కిందనే ఆవేదన, ఆక్రోశంతోనే కదా! అనే చర్చ జరిగింది.
ఇక, ఏపీలో అయితే.. ఈ పరిస్థితి మరింత దారుణం.. చంద్రబాబు మొహం చూసేందుకు సీఎం జగన్, ఈయన మొహం చూసేం దుకు చంద్రబాబు కూడా ఇష్టపడని రోజులు కొనసాగుతున్నాయి. ఇలాంటి రాజకీయాలు కొనసాగుతున్న నేటి రోజుల్లో తెలంగా ణ మాజీ గవర్నర్ తమిళి సై.. అనూహ్యంగా పాతతరం రోజులను గుర్తు చేశారు. ఆమె చేసిన పనిని.. నెటిజన్లు ముక్తకం ఠంతో స్వాగతిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళసై తన సొంత పార్టీ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఆమెకు చెన్నై దక్షిణ పార్లమెంటు స్థానం టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో తమిళసై సోమవారం తన నామినేషన్ వేశారు. అలా ఆమె నామినేషన్ దాఖలు చేసి, బయటకు వస్తున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అదే సమయంలో తన సమీప ప్రత్యర్థి, డీఎంకే ఎంపీ అభ్యర్థి మహిళ నేత తమిజాచి తంగపాండియన్ నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు.
సహజంగా ఏపీలేదా.. తెలంగాణల్లో అయినా.. ప్రత్యర్థులు ఎదురుపడితే.. వ్యతిరేక నినాదాలు.. కొట్లాటలు, కవ్వింపులు కామన్ కానీ, తమిళి సై సహా తమిజాచి అలా చేయలేదు. ఇద్దరు నేతలు ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. అంతేకాదు.. ఇద్దరు నవ్వుతూ ఒకరినొకరు కౌగిలించుకుని, అప్యాయంగా పలకరించుకున్నారు. అది చూసిన అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో వారిద్దరూ అలా అప్యాయంగా పలకరించుకోవడం పాత రోజులు గుర్తుకు వచ్చేలా చేసిందని అంటున్నారు పరిశీలకులు.