బంతి కేసీఆర్ కోర్టులో వేసిన గవర్నర్... తెరపైకి కీలక ప్రశ్నలు!

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే

Update: 2023-08-05 07:04 GMT

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి బిల్లును సభలో ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరింది. అయితే గవర్నర్ ఆ బిల్లును ఇంకా ఆమోదించ లేదు. దీనిపై మరింత వివరణ కోరుతూ రాజ్ భవన్ ప్రభుత్వానికి లేఖ రాసింది.

అవును... టీ.ఎస్‌.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తాజాగా వివరణ కోరారు. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరారు. ప్రభుత్వం నుంచి తక్షణమే సమాధానం వస్తే బిల్లుపై నిర్ణయం త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని రాజ్ భవన్ వెల్లడించింది.

ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ లేవనెత్తిన ఐదు అంశాలు ఇలా ఉన్నాయి.

ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు బిల్లులో ఎందుకు లేవు!

ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు?

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా?

విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు!

పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌ లో న్యాయం ఎలా చేస్తారు?

వంటి ఐదు అంశాలపై తెలంగాణ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బిల్లు ఆమోదించే విషయంలో తనదేమీ ఆలస్యం లేదని.. ప్రభుత్వం ఎంత తొందరగా వివరణ ఇస్తే.. అంత తొందరగా బిల్లును ఆమోదించనున్నట్లు తెలిపారు. దీంతో... బంతిని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనే వేసేశారు గవర్నర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇలా గవర్నర్ ఐదు కీలక అంశాలను లేవనెత్తడంతో ప్రభుత్వం ఆ పనిలో ఉంది. గవర్నర్‌ కోరిన వివరణలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై వీలైనంత తొందరగా వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు టీ.ఎస్.ఆర్టీసీ కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన బిల్లుకు గవర్నర్ ఆమోదం కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంపై గవర్నర్ స్పందించారు. బిల్లుపై చర్చించి నిర్ణయం తీసుకుందామని తమిళి సై పిలుపునిచ్చారు.

కాగా, బిల్లుపై గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికుల శనివారం నిరసనకు దిగారు. దీంతో ఉదయం వేళ ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags:    

Similar News