స్పీకర్ గా శాసించారు...అభ్యర్ధిగా అర్ధిస్తున్నారు...!

ఆయన అయిదేళ్ల పాటు స్పీకర్ గా ఉన్నారు. ఆయన అసెంబ్లీలో చంద్రబాబు లాంటి వారిని శాసించారు

Update: 2024-04-06 17:14 GMT

రాజకీయాల్లో ఇలాగే జరుగుతుంది. పదవులలో ఉన్న టైం లో ఎవరూ కంటికి కనబడరు. తీరా ఎన్నికలు వచ్చేసరికి ఓట్ల లెక్కలు కనబడేసరికి అందరూ అవసరం అవుతారు. ఎవరి వద్దకైనా వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ వైసీపీ నేత, స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం పరిస్థితి అలాగే ఉంది అని అంటున్నారు.

ఆయన అయిదేళ్ల పాటు స్పీకర్ గా ఉన్నారు. ఆయన అసెంబ్లీలో చంద్రబాబు లాంటి వారిని శాసించారు. తన మాటే శిరోధార్యం అని ఆయన అసెంబ్లీని నడిపారు. కానీ ఇపుడు ఆయన సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో గెలవాల్సి ఉంది. దాంతో సొంత పార్టీలో ప్రత్యర్ధులను కూడా మంచి చేసుకోవాల్సిన అవసరం పడింది.

ఒకనాడు తన రాజకీయ చాతుర్యంతో తన పార్టీ వారినే ఎదగనీయకుండా చేసిన తమ్మినేని ఇపుడు ఓట్ల కోసం వారి ముంగిటకే వెళ్ళి అర్ధిస్తున్నారు. తమ్మినేని అంటే పడని వారు వైసీపీలో ఉన్నారు. వారు వర్గాలుగా విడిపోయారు. అందులో కీలక నేత సువ్వారి గాంధీ అయితే వైసీపీకి ఏకంగా రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఆయన కొంత మందిని వైసీపీ నుంచి తీసుకెళ్ళిపోయారు.

ఆ ఓట్ల చీలిక వల్ల కలిగే నష్టం ఎంత ఉంటుందో తెలియదు. ఇపుడు మరో అసమ్మతి నేతను మంచి చేసుకునేందుకు తమ్మినేని ఆయన ఇంటికి వెళ్లారు. కోట గోవిందరావు అనే కీలక నేత వైసీపీలో ఉన్నారు. ఆయన 2019లో తమ్మినేని విజయానికి కృషి చేశారు. కానీ ఈసారి మాత్రం ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు.

దాంతో ఆయన ఇంటికి వెళ్ళి ఓటుతో పాటు మద్దతుని తమ్మినేని కోరారు. అయితే దానికి ఆ అసమ్మతి నేత ఏమీ బదులీయకుండా తమ్మినేనిని పట్టించుకోకపోవడం వైసీపీలో చర్చకు వస్తోంది. చేతులు జోడించి తమ్మినేని నమస్కరించినా ప్రతి నమస్కారం సైతం చేయలేదు అంటే తమ్మినేని సొంత పార్టీ వారికి ఎంత దూరం అయ్యారు కదా అని అంటున్నారు.

ఇక్కడ అసమ్మతి నేతకు ఆగ్రహం కలగడానికి కారణం ఏంటి అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఆయన సతీమణి ఎంపీటీసీగా పోటీ చేస్తే ఆమెకు మద్దతు ఇవ్వకుండా తమ్మినేని తన సొంత వదినను గెలిపించారని అలా ఆయన ఎదుగుదలకు చెక్ పెట్టారని అంటున్నారు.

ఇపుడు తనను గెలిపించాలని ఆయన మద్దతు కోరుతున్నారని రాజకీయాలో ఇలాంటివి సహజమే అయినా స్పీకర్ గా అసెంబ్లీని శాసించిన పెద్దాయన తన నియోజకవర్గంలో అసమ్మతి నాయకులను ఎన్నికల ముందే దగ్గరకు తీసి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చి ఉండేవి కావు కదా అంటున్నారు. అసలే టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గంలో సొంత పార్టీలో కూడా వ్యతిరేకత పెంచుకున్న తమ్మినేనికి 2024 ఎన్నికల్లో ఎలాంటి ఫలితం వస్తుందో అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News