తానా - 2023 ఎన్నికల ఫలితాలు... విజేతలు వీరే!
తానా - 2023 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ఈ ఫలితాలను వెల్లడించారు.
తానా - 2023 ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ఈ ఫలితాలను వెల్లడించారు. ఇందులో భాగంగా తానా తదుపరి అధ్యక్షుడిగా కృష్ణాజిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్ కొడాలి గెలుపొందినట్లు తెలిపారు. గతంలో అధ్యక్ష ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు చేతిలో ఓడిన ఆయన, 2023లో సెలక్షన్ పద్ధతిలో అధ్యక్షుడిగా నియమితులయ్యారు!
అవును... ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఎన్నికల 2023 ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో భాగంగ... నరేన్ కొడాలి ప్యానెల్ బంపర్ విక్టరీ సాధించింది. ఈ ఎన్నికల్లో నరేన్ కొడాలికి 13,225 ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థి వేమూరి సతీష్ కు 10,362 ఓట్లు లభించాయి. దీంతో నరేన్ ప్యానెల్ సంబరాలు అంబరాన్నంటాయని తెలుస్తుంది.
ఈ సందర్భంగా కార్యదర్శిగా రాజా కసుకుర్తి గెలుపొందగా... జాయింట్ సెక్రటరీగా వెంకట్ కోగంటి ఎంపికయ్యారు. ఇదే సమయంలో... జాయింట్ ట్రెజరర్ గా సునీల్ పంత్రా, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ గా లోకేష్ కొణిదల, కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ గా ఉమా ఆర్ కటికి, కొత్త మహిళా సేవా సమన్వయకర్తగా సోహిని అయనాల, ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ గా ఠాగూర్ మల్లినేని, కౌన్సిలర్ గా సతీష్ కొమ్మన ఎంపికయ్యారు.
కాగా... తానాకు అమెరికాలో శాశ్వత భవనం నిర్మించేందుకు తన సొంత నిధులు లక్ష డాలర్లు విరాళంగా అందజేయడంతో పాటు రెండున్నర లక్షల డాలర్లు విరాళాలు సమీకరించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని నరేన్ కొడాలి తెలిపారు. ఇదే సమయంలో... తానాలో అత్యధిక మంది సభ్యులు ఎఫ్1-హెచ్1 వీసాలపై అమెరికాకు వలస వచ్చినవారు ఉన్నారని, వీరికి ప్రత్యేకంగా ఇద్దరు లాయర్లతో శాశ్వత ప్రత్యేక న్యాయసేవల విభాగాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.