'టార్గెట్ జగన్'.. బాబు నయా గేమ్ ఏంటి...?
ఇక, కృష్ణానదిలో నాలుగు భారీ పడవలు కొట్టుకు వచ్చిన ఘటన వెనుక కూడా వైసీపీ నేతలు ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు.
టార్గెట్ జగన్.. ఇదీ.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ``మా కోడలు ఊరు నుంచి రాలేదు.. వచ్చుంటే పిల్లి పాలు తాగిపోయేది కాదు`` అని వెనకటికి ఒక అత్తగారు యాగీ చేసినట్టుగా ఏపీలో రాజకీయాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. చంద్రబాబు ఎక్కడ మైకు పుచ్చుకున్నా.. జగన్‌ను సెంట్రిక్‌గానే రాజకీయాలు చేస్తున్నారు. జగన్‌నే ఏకేస్తున్నారు. కారణాలు ఏవైనా.. సమస్యలు ఏవైనా దానికి మూల కారణం జగనేనని అంటున్నారు.
విజయవాడలో వరదలు రావడానికి.. జగన్ పాలనే కారణమని చంద్రబాబు ఇప్పటికీ చెబుతున్నారు. బుడమేరు గండ్లు పూడ్చలేదని.. ఐదేళ్ల పాలనలో నిద్ర పోయారని అన్నారు. ఇక, ఏలేరు రిజర్వాయర్ కు భారీ నీరు వచ్చి గ్రామాలు మునిగిపోతే కూడా.. జగనే కారణమన్నారు. ఇక, కృష్ణానదిలో నాలుగు భారీ పడవలు కొట్టుకు వచ్చిన ఘటన వెనుక కూడా వైసీపీ నేతలు ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం విచారణ కూడా సాగుతోంది.
సో.. రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరిగినా.. అంతా జగన్ నామస్మరణే చేస్తున్నారు. ఇక, జగన్ ఎక్కడైనా మైకు పుచ్చుకు ని ఏవైనా రెండు మాటలు అంటే.. వాటిపై మంత్రులు రెచ్చిపోతున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బుడమేరు వరదకు-అన్నమయ్య డ్యామ్(కడప)కు ముడి పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఇలా.. అన్నింటికీ జగన్ టార్గెట్ కావడానికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. ఆయనకు పట్టుమని ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలు. నలు గురు ఎంపీలు మాత్రమే. మరి అంతగా జగన్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది ప్రశ్న.
ఎందుకంటే.. జగన్ రాజకీయంగా ఓడిపోయినా.. ఆయనకు ప్రజల్లో నలభై శాతం మేరకు ఆదరణ ఉంది. అంత భారీ వ్యతిరేకతలోనూ వైసీపీకి నలభై శాతం ఓటు బ్యాంకు దక్కింది. ఇదే.. కూటమిని కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ పరిణామాలతోనే జగన్ చెప్పింది.. జనాలు నమ్మే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే చంద్రబాబు వ్యూహాత్మకంగా జగన్‌ను టార్గెట్ చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రత్యర్థి అంటూ .. ఎవరైనా ఉంటే అది జగనే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగానే టార్గెట్ జగన్ మంత్రాన్ని చంద్రబాబు నూరిపోస్తున్నారు. అయితే.. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే.. పదే పదే జగన్‌ను టార్గెట్ చేస్తే.. ఆ నెగిటివ్ ప్రచారం కాస్తా.. పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది!!