రాజ్యసభ 'పుణ్యం' దక్కేది ఎవరికి?
వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ.. ఇటీవల ఆ పార్టీకి, తన పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు.
ఏపీలో ఇప్పటికిప్పుడు వచ్చే నెల్లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవి రెండు కూడా.. కూటమి పార్టీలకే దక్కనున్నాయి. అసెంబ్లీలో బలం ఎక్కువగా ఉన్నందున.. టీడీపీ, బీజేపీ, జనసేనల్లో ఎవరైనా ఈ పదవులు దక్కించుకునేందుకు అవకాశం ఉంది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ.. ఇటీవల ఆ పార్టీకి, తన పదవికి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. దీంతో ఈ సీటు కూటమికి దక్కింది.
ఇక, వైసీపీ నాయకుడిగా ఉంటూ.. రాజ్యసభలో అడుగు పెట్టిన బీసీ నాయకుడు, వ్యాపార వేత్త బీద మస్తా న్ రావు కూడా వైసీపీకి రాజీనామా చేసి.. సైకిల్ ఎక్కారు. దీంతో ఈ సీటు కూడా టీడీపీ కూటమికే దక్కనుం ది. అయితే.. ఇప్పుడు ఈ రెండు స్థానాలను ఎవరు తీసుకుంటారనేది ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఈ సీట్ల విషయంలో టీడీపీ-జనసేనలు పోటీలో ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
దీంతో ఒక సీటును టీడీపీ ఖచ్చితంగా తీసుకుంటుంది. అదేవిధంగా జనసేనకు కూడా.. రాజ్యసభ మొ హం ఇప్పటి వరకు తెలియదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి కూడా ఒక సీటు దక్కుతుందనే అంటున్నారు. రెండు మిత్రపక్షాలు కాబట్టి.. చెరో సీటును పంచుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే.. ఇక్కడ మరో ట్విస్టు కూడా ఉంది. వైసీపీ నుంచి వచ్చిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా.. నేరుగా టీడీపీలో చేరారు కాబట్టి.. రెండూ టీడీపీకే దక్కుతాయని విజయవాడకు చెందిన టీడీపీఫైర్ బ్రాండ్ ఒకరు సూత్రీకరిస్తున్నారు.
దీంతో ఈ రెండు స్థానాల విషయంలో టీడీపీ, జనసేన ఎలా వ్యవహరిస్తాయనేది చూడాలి. ఇక, మరో వైపు.. రెండు స్థానాలను వదులుకుని పార్టీ మారిన నేపథ్యంలో ఆ రెండు సీట్లను కూడా.. వారికే(మోపిదేవి, బీద) కేటాయిస్తారా? అనేది చూడాలి. గతంలో జగన్.. ఇలానే చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వారి వారి పదవులు వారికే అప్పగించారు. మరి ఇప్పుడు చంద్రబాబు కూడా అలా చేస్తారా? లేక కొత్తవారికి ఛాన్స్ ఇచ్చి.. అశోక్ గజపతి రాజు వంటివారిని రాజ్యసభకు పంపిస్తారా? అనేది చూడాలి.