వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. 'దుబారా' ల‌డాయి!

రాజ‌కీయాల‌న్నాక ఏదో ఒక ర‌గ‌డ ఉండాల్సిందే. ముఖ్యంగా టీడీపీ-వైసీపీ వంటి భ‌గ్గుమ‌నే పార్టీల మ‌ధ్య నిత్యం ఏదో ఒక వివాదం న‌డుస్తూనే ఉంది.

Update: 2024-10-08 14:14 GMT

రాజ‌కీయాల‌న్నాక ఏదో ఒక ర‌గ‌డ ఉండాల్సిందే. ముఖ్యంగా టీడీపీ-వైసీపీ వంటి భ‌గ్గుమ‌నే పార్టీల మ‌ధ్య నిత్యం ఏదో ఒక వివాదం న‌డుస్తూనే ఉంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ వివాదం దాదాపు నెల రోజుల వ‌ర‌కు సాగిపోయింది. దీనికి ముందు వ‌ర‌ద‌లు. అదేస‌మ‌యంలో కృష్ణాన‌దిని నాలుగు ఇనుప బోట్ల‌తో కూల్చివేయాల‌న్న కుట్ర చేశారంటూ వైసీపీపై టీడీపీ నేత‌లు నిప్పులు చెరిగారు. దీనికి ముందు త‌మ వారిపై దాడులు చేస్తున్నారంటూ.. వైసీపీ నేత‌లు ఢిల్లీ వ‌ర‌కు వెళ్లి యాగీ చేశారు. ఇలా.. ఏదో ఒక కార‌ణం.. ఏదో ఒక వివాదం ఏపీలో నిత్య‌కృత్యంగా మారిపోయింది.

తాజాగా దుబారా!

తాజాగా వైసీపీ నేత‌లు కూట‌మి స‌ర్కారుపై, ముఖ్యంగా చంద్ర‌బాబు, ఆయ‌న మంత్రులపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వ‌ర‌దల కార‌ణంగా న‌ష్ట‌పోయిన వారిని ఆదుకోవ‌డం అటుంచి.. దీనికి సంబంధించి చేసిన ఖ‌ర్చుల విష‌యంలో దొంగ లెక్క‌లు చూపిస్తు న్నారంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. 21 ల‌క్ష‌ల మంచి నీళ్ల బాటిళ్ల‌కు 3.5 కోట్ల ఖ‌ర్చు, పులిహోర పొట్లాల‌కు 23 కోట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల ఖ‌ర్చుకు 23.5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్టు ప్ర‌భుత్వం వైపు నుంచి వ‌చ్చిన వివ‌ర‌ణ‌పై వైసీపీ నేత‌లు ఘాటుగానే స్పందించారు. దీనికి సంబంధించి వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రొజెక్టు చేసింది కూడా.

దీనిపై టీడీపీ కూడా అంతే స్పీడుగా రియాక్ట్ అయింది. ఒక‌వైపు అధికారుల నుంచివివ‌ర‌ణ‌లు వ‌స్తూనే ఉన్నాయి. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల‌కు అయిన ఖ‌ర్చు 23.5 కోట్లుగా పేర్కొన్న అధికారులు త‌ర్వాత దానిని స‌రిదిద్దుకున్నారు. ఈ ఖ‌ర్చు మొబైల్ జ‌న‌రేట‌ర్ల‌ను వినియోగించ‌డం వ‌ల్ల జ‌రిగింద‌న్నారు. ఇత‌ర విష‌యాల‌పై మాత్రం అధికారులు సైలెంట్‌గా ఉన్నారు. అయితే.. టీడీపీ అధికార ప్ర‌తినిధులు, మంత్రులు మాత్రం వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వ‌ర‌ద సాయంలో దుబారా చేయాల్సిన అవ‌స‌రం.. నొక్కేయాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని వారు చెబుతున్నారు.

ఇప్పుడు.. తాజాగా టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి.. మ‌రో అడుగు ముందుకు వేసి.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన దుబారా ఇదంటూ లెక్క‌లు చెప్పుకొచ్చారు. వైసీపీ హ‌యాంలోనే ప్ర‌జాధ‌నం దుర్వినియోగం అయింద‌ని తేల్చేశారు. ఆయ‌న చెప్పిన లెక్క‌లు ఇవీ..

+ స‌చివాల‌యాల‌కు వేసిన రంగుల కోసం 3 వేల కోట్లు

+ సర్వేరాళ్లపై జగన్‌ బొమ్మల కోసం రూ.700 కోట్లు

+ రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి రూ.600 కోట్లు

+ జ‌గ‌న్ సొంత ప‌త్రిక సాక్షిలో ప్రకటనలకు రూ.500 కోట్లు

+ అధికారంలో ఉన్నప్పుడు ఆర‌గించిన‌ ఎగ్‌ పఫ్‌ల ఖ‌ర్చు 3.5 కోట్లు

+ రంగులు, ప్రచారానికి, చెట్లు న‌ర‌క‌డానికి ఖ‌ర్చు రూ.4,800 కోట్లు

కొస‌మెరుపు ఏంటంటే.. ఈ లెక్క‌ల వ‌ల్ల ఎవ‌రికి ఎలాంటి ఉప‌యోగ‌మో తెలియ‌దు. నిజ‌మైన వ‌ర‌ద‌బాధితుల‌ను ఆదుకునేందుకు ఇరుప‌క్షాలు ప్ర‌య‌త్నిస్తే.. కొంత ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌డంతోపాటు బాధితుల‌కు ఆవేద‌న త‌గ్గుతాయి.

Tags:    

Similar News