టీడీపీ వర్సెస్ వైసీపీ....మరో ఎన్నికల యుద్ధం

దాంతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు నోటిఫికేషన్ ఈ నెల 4 న విడుదల చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.

Update: 2024-11-02 17:30 GMT

విజయనగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో 2021లో వైసీపీ నుంచి గెలిచి ఆ తరువాత టీడీపీకి ఎన్నికల సహకరించిన రఘు వర్మను వైసీపీ ఫిర్యాదు నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ అనర్హత ప్రకటించి సభ్యత్వం రద్దు చేశారు.

దాంతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు నోటిఫికేషన్ ఈ నెల 4 న విడుదల చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ, 12 న నామినేషన్లు పరిశీలన, 14 న ఉపసంహరణకు చివరి తేదీగా ఉంది. ఇక ఈ నెల 28 ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, డిసెంబర్ 1 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు తెలిపారు.

స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. దాంతో విజయనగరం జిల్లాలో వైసీపీ టీడీపీ కూటమి మధ్య రాజకీయ సమరానికి పూర్తిగా రంగం సిద్ధం అయింది. విజయనగరంలో స్థానిక సంస్థలు అన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. అలాగే విజయనగరం కార్పొరేషన్ కూడా వైసీపీది గా ఉంది.

మొత్తం మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుతో సైతం వైసీపీ ఆధీనంలో ఉంది. ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ రోజుకీ వైసీపీకే ఎక్కువ మంది ఉన్నారు. అలాగే బొబ్బిలి మున్సిపాలిటీ వైసీపీ చేతిలో ఉంది. పార్వతీపురం సాలూరు మునిసిపాలిటీలు కూడా వైసీపీ ఏలుబడిలో ఉన్నాయి.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమి వైపుగా వెళ్లిపోయారు. అయితే ఈ రోజుకు కూడా వైసీపీకే మెజారిటీ ఉంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి గోడ దూకుళ్ళు వైసీపీ నుంచి టీడీపీ కూటమి వైపు అధికంగా ఉండవచ్చు అని అంటున్నారు

అదే సమయంలో ఈ ప్రలోభాలను తట్టుకుని వైసీపీ ఎంతవరకూ తన ఎమ్మెల్సీ సీటుని దక్కించుకుంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీ విజయనగరం జిల్లా ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్ గా మజ్జి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు మేనల్లుడు. ఇక బొత్స సొంత ఇలాకా అయిన విజయనగరం జిల్లాలో ఆయన జోక్యం చేసుకోవాల్సి ఉంది.

ఒక విధంగా ప్రెస్టేజ్ గా తీసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. బొత్స సతీమణి ఝాన్సీ విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేస్తే ఆమెకు యాంటీగా రఘువర్మ పనిచేశారు అని ఫిర్యాదుతోనే రఘు వర్మ మీద అనర్హత వేటు పడింది. దాంతో తమ సీటుని తాము తిరిగి సాధించుకోవడానికి అయినా వైసీపీ నేతలు అంతా ఐక్యంగా ఉంటూ గట్టిగా పనిచేయాల్సి ఉంది.

ఇక టీడీపీ కూటమికి ఇది తొలి ఎన్నికల సమరం. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత సొంత జిల్లాలో ఆధిపత్యం కొనసాగించాల్సిన అవసరం కూటమి మీద ఉంది. విజయనగరం జిల్లాలో అన్ని సీట్లను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ కూటమికి ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక సవాల్ లాంటివి అని చెప్పాలి.

దాంతో అంతా కలసి సమిష్టిగా కృషి చేయాల్సి ఉంది. వైసీపీని ఈ ఎన్నికల్లో కూడా ఓడిస్తే జిల్లాలో కూటమి విజయం సంపూర్ణం అవుతుంది అని అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎవరు ఉంటారు అన్నది కూటమిలో చర్చగా ఉంది. తన పదవిని వదులుని టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన రఘు వర్మకే టికెట్ ఇస్తారా లేక వేరెవరికి అయినా ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి అయితే ఢీ అంటే ఢీ అన్నట్లుగా మరో ఎన్నికల యుద్ధానికి రెండు పార్టీలు సిద్ధపడుతున్నాయి.

Tags:    

Similar News