నాడు విజయమ్మ... నేడు భువనమ్మ....!

ఇపుడు భువనేశ్వరి కూడా అలాంటి ఎమోషన్ని టీడీపీకి బిల్డప్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Update: 2023-10-25 02:45 GMT

ఏపీలో కస్సుబుస్సు రాజకీయాలకు రంగం సిద్ధం అవుతోంది. బస్సు యాత్రలకు ముహూర్తం కూడా కుదిరిపోయింది. నిజం గెలవాలి పేరుతో నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఏపీ అంతటా ఈ యాత్ర సాగనుంది. ఈ నెల 25 నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి మొదలయ్యే ఈ యాత్రతో భువనేశ్వరి రాజకీయంగా కొత్త పాత్రలోకి రానున్నారు.

ఏపీలో వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ నాడు తన కుమారుడు జగన్ అరెస్ట్ అయిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం జనంలోకి వచ్చారు. ఆమె నాడు ఇచ్చిన ప్రసంగాలు ఏపీ జనాలను ఆకట్టుకున్నాయి. వైసీపీకి కొంత సానుభూతిని సాధించి పెట్టాయి. అన్యాయంగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నారు అంటూ విజయమ్మ చేసిన ఎమోషనల్ స్పీచెస్ జనంలో ఆలోచనలు పెంచాలి. అది వైసీపీకి బలమైన పునాదిగా మారింది.

ఇపుడు భువనేశ్వరి కూడా అలాంటి ఎమోషన్ని టీడీపీకి బిల్డప్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే వైఎస్ విజయమ్మ జగన్ అరెస్ట్ నాటికే రాజకీయంగా చూస్తే కొంత పరిచయం అయి ఉన్నారు. ఆమె పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అసెంబ్లీలో ఆమె కొన్ని ప్రసంగాలు చేసారు. పైగా జగన్ నాడు కొంత గైడెన్స్ ఇస్తూ తల్లిని జనంలోకి పంపారు.

ఆమెకు తోడుగా కుమార్తె షర్మిల కూడా ఉంది. అలా విజయమ్మ సభలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి భువనేశ్వరికి అలాంటి రెస్పాన్స్ వస్తుందా ఆమె జనాలను ఆకట్టుకోగలరా అన్నది చూడాల్సి ఉంది. ఆమె జనాలకు అర్ధమయ్యే విధంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కలిగిన బాధను జరిగిన అన్యాయాన్ని వివరించగలరా అన్నది చర్చగా ఉంది. ఇక భువనేశ్వరికి రాజకీయంగా ఏమి మాట్లాడాలి అన్న దాని మీద సీనియర్లు కొంత ట్రైనింగ్ ఇచ్చారని ప్రచారం సాగింది.

ఆమె చంద్రబాబు అరెస్ట్ అయిన కొత్తల్లో మాట్లాడుతూ మాకు 371 కోట్ల రూపాయలు ఒక లెక్కా అంటూ మాట్లాడారు. హెరిటేజ్ లో రెండు శాతం షేర్లు అమ్మితే నాలుగు వందల కోట్లు వస్తాయని కూడా చెప్పి తమ ఆస్తుల వివరాలు బయటపెట్టారు. దానిని వైసీపీ ఆయుధంగా మార్చుకుంది. ఇంత సంపాదన ఎలా వచ్చిందని కూడా విమర్శల దాడి చేయడం మొదలెట్టింది.

అంతే కాదు జైలులో దోమలు ఉన్నాయి. వేడి నీళ్ళు పెట్టలేదు, ఏసీ లేదు అంటూ ఆమె చెప్పిన మాటలు కూడా జనాలకు చిత్రంగా తోచాయి. జైలులో ఎందుకు సౌకర్యాలు ఉంటాయని జనాల మధ్యన చర్చకు వచ్చింది. దాంతో చూస్తే భువనేశ్వరి మాట తీరు కూడా ఈ బస్సు యాత్రలో చాలా ముఖ్యమని అంటున్నారు. ఆమె ఎమోషనల్ గా మాట్లాడితే టీడీపీకి లాభం. అయితే బాబు అరెస్ట్ అక్రమం అని ఆమె ఎంత చెప్పినా తీర్పు ఇచ్చేది న్యాయ స్థానాలు కాబట్టి జనాలకు ఇప్పటికే ఈ విషయంలో తెలియాల్సింది తెలిసిపోయింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈ యాత్ర మొదలెట్టడం కూడా బాగా లేట్ అయింది అంటున్నారు. ఏది ఏమైనా జనాల మనసు గెలుచుకోవడం అన్నది ఒక కళ. అదే విధంగా కొన్ని సార్లు పరిస్థితుల వల్ల కూడా సక్సెస్ అవుతారు. ఇపుడు ఏపీలో అలాంటి పరిస్థితి ఉందా బాబు మీద సింపతీ ఉందా ఉంటే అది ఎంత పాళ్ళు అన్నది భువనేశ్వరి బస్సు యాత్రతో బయట పడుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News