వాలంటీర్ల మీద ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
ఏపీలో తొమ్మిది నెలల క్రితమే ఈసీ తన కార్యకలాపాలు మొదలెట్టింది అంటే ఏపీలో ఏమి జరుగుతోంది అన్నది ఈసీ బాగా అర్ధం చేసుకుంది అని టీడీపీ
ఏపీలో వాలంటీర్ల మీద రాజకీయ రచ్చ అలా కొనసాగుతూనే ఉంది. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వైసీపీ ఓటర్ల జాబితాను పెద్ద ఎత్తున గల్లంతు చేస్తోంది అని తెలుగుదేశం పార్టీ ఒక సీరియస్ ఆరోపణనే చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికే ఈ మేరకు టీడీపీ ఫిర్యాదు చేసింది.
ఏపీలో ప్రతీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు గల్లంతు అయ్యాయని, ఇదంతా వాలంటీర్లను ముందుంచి వైసీపీ చేయిస్తోంది అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఒక చోట 34 మంది ఓటర్లకు ఒకే తండ్రి పేరు ఉందంటే పరిస్థితి గ్రహించాలని ఆయన అధికారులను కోరారు.
ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు జరిగినపుడు పక్క రాష్ట్రాల నుంచి ఎన్నికల విధులకు అధికారులను రప్పించాలని అచ్చెన్న కోరడం విశేషం. ఏపీలో అధికారులు అయితే సరిగ్గా పనిచేయరని అంటున్నారు.
ఇక రెండేళ్ల క్రితం పర్మనెంట్ అయిన సచివాలయ ఉద్యోగులను ఎట్టి పరిస్థితులలోనూ ఎన్నికల విధులలోకి తీసుకోరాదని టీడీపీ ఈసీని కోరుతోంది. వారికి ఏ మాత్రం అనుభవం లేదని అంటోంది. అయితే వారు కూడా వైసీపీ ప్రభుత్వం నియమించిన ఉద్యోగులు కాబట్టి సచివాలయ వ్యవస్థ వైసీపీ సృష్టి కాబట్టి అధికార పార్టీకి అనుకూలంగా వారు ఓట్లు వేయిస్తారు అన్న భయాన్ని కలవరాన్ని ఈసీ ముందు టీడీపీ ఉంచుతోంది అని అంటున్నారు.
ఏపీలో తొమ్మిది నెలల క్రితమే ఈసీ తన కార్యకలాపాలు మొదలెట్టింది అంటే ఏపీలో ఏమి జరుగుతోంది అన్నది ఈసీ బాగా అర్ధం చేసుకుంది అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అంటున్నారు. ఎంతటి అధికారులు అయినా తప్పు చేస్తే శిక్ష తప్పదని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందని ఆయన గుర్తు చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల సంఘాన్ని స్వతంత్రంగా పనిచేయని దుస్థితి ఉందని, రూల్ ఆఫ్ లా ఏపీలో లేకుండా చేశారని పయ్యావుల అంటున్నారు. ఇక వాలంటీర్లు ప్రజల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని, ఈ విషయాన్ని కూడా తాము ఈసీ దృష్టికి తీసుకుని వచ్చామని ఆయన అంటున్నారు.
ఏపీలో మరో నెల వరకూ ఓటర్ల సర్వే గడువు పొడిగించాలని టీడీపీ ఈసీని కోరింది. ఇదిలా ఉంటే విశాఖలో బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఈసీ అధికారులు సమావేశం అయి ఏపీలో ఓటింగ్ ప్రక్రియ ఇతర పరిస్థితుల మీద సమీక్ష చేశారు. ఇక గురువారం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి వారి నుంచి కూడా సలహా సూచనలు తీసుకున్నారు.
ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ బహిరంగంగా విమర్శలు చేస్తే నాడు ఏమీ మాట్లాడని టీడీపీ ఇపుడు చాలా వ్యూహాత్మకంగా ఈసీకి అదే విషయాన్ని ఫిర్యాదు చేసింది. వ్యక్తిగత డేటా అంతా వాలంటీర్లు సేకరిస్తున్నారు అని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేయడం ద్వారా పవన్ ఆరోపణలను సమర్ధించింది.
అయితే ఆ విషయం మీద ఎక్కడా బాహాటంగా ఇంతవరకూ టీడీపీ ప్రస్తావించలేదు సరికదా తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది. కానీ నిజానికి జనసేన ఆరోపణలనే టీడీపీ కూడా చేసింది. ఇంకా ఎక్కువగానే చేర్చి మరీ ఎక్కడ వాటిని ఇవ్వాలో అక్కడే ఇచ్చింది. తన ఫార్టీ ఇయర్స్ అనుభవాన్ని చాటుకుంది.