తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరం.. కాసాని దారేంటి?

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల వేళ.. పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

Update: 2023-10-29 05:38 GMT

అంచనాలకు తగ్గట్లే నిర్ణయం వెలువడింది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల వేళ.. పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ.. అంతో ఇంతో బలంగా ఉన్న టీడీపీ.. ఆ తర్వాత నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నిజానికి 2014లో తెలంగాణలో ఒక మోస్తరు సీట్లను సొంతం చేసుకున్న ఆ పార్టీ.. ఈ రోజున ఎన్నికల పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి.

పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు.. జైల్లోఉన్న ఆయన.. వైసీపీ సర్కారు మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు.ఇలాంి వేళ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేమని పేర్కొంది. తమకున్న వనరులు.. సామర్థ్యాల్ని ఏపీ మీదనే పెట్టే ఆలోచనలో ఉన్న పార్టీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీకి దూరంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో నామమాత్రంగా పోటీ చేసే కంటే.. పోటీకి దూరంగా ఉండటమే మంచిదన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు చంద్రబాబు వివరించినట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీ చేయలేమని.. పోటీ చేస్తే పూర్థి స్థాయిలో యుద్ధం చేయాలే తప్పించి నామమాత్రంగా చేయటం సరికాదన్న అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆషామాషీగా పోటీ చేసి.. సరైన ఫలితాలు రాలేదని బాధ పడే కన్నా.. పోటీకి దూరంగా ఉండటం మేలు అన్న మాటను చెప్పినట్లుగా చెబుతున్నారు. తాను చెప్పిన విషయాల మీద కాసానిని ఆలోచన చేయాలని చెప్పిన చంద్రబాబు.. అవసరమైతే మరోసారి భేటీ అవుదామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పార్టీ అధినేత నిర్ణయం నేపథ్యంలో కాసాని పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. అలాంటిదేమీ లేదని చెబుతున్నా.. ఆయన.. ఆయన కుమారుడు మాత్రం పార్టీనుంచి బయటకు వచ్చి.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ ను ప్రదర్శించుకోవాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News