పెద్దిరెడ్డి ఫ్యామిలీకి పుంగనూరు బంధం కట్ అయినట్లేనా ?

వైసీపీలో జగన్ ఆయనకు రాయలసీమ బాధ్యతలను మొత్తం అప్పగించారు.

Update: 2024-07-19 03:38 GMT

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమలో సీనియర్ మోస్ట్ లీడర్. చంద్రబాబు సమకాలీనుడు. ఆయన రాజకీయం అంతా పాకాన పడడానికి వైఎస్సార్ అండ కావాల్సి వచ్చింది. మొట్టమొదటిసారి వైఎస్సార్ హయాంలో మంత్రి అయ్యారు. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన జగన్ వైపు మళ్లారు. వైసీపీలో జగన్ ఆయనకు రాయలసీమ బాధ్యతలను మొత్తం అప్పగించారు.

అలా పార్టీని ఒక హార్డ్ కోర్ రీజియన్ లో చూసుకుంటూ తాను సైతం ఒక వెలుగు వెలిగిన పెద్దిరెడ్డికి చంద్రబాబుతో దశాబ్దాల వైరం. దాన్ని రాజకీయాలతో మరింతగా మిక్స్ చేసి జగన్ సీఎం గా ఉండగా తాను మంత్రిగా ఉండగా చేయాల్సినంతా చేశారు దానికి ఉదాహరణ అంగళ్ళలో చంద్రబాబు అడుగుపెట్టకుండా నియంత్రించే స్థాయి దాకా వెళ్లింది.

ఇక చంద్రబాబుని కుప్పంలో ఓడిస్తాను అని చెప్పి అక్కడ కూడా మాజీ సీఎం ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన కుమారుడు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి సైతం పార్టీలో విశేష అధికారం చలాయిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో అభ్యర్ధులను ఎంపిక చేసిన వారిలో ఆయన కూడా ముఖ్యులని పేరు. పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి మిధున్ రెడ్డి వ్యూహాలు రూపొందించారు అని ప్రచారంలో ఉంది.

ఈసారి కూడా అధికారంలోకి వస్తామని మితిమీరిన పవర్ ని అయిదేళ్ళలో ఉపయోగించడం వల్లనే చివరికి పెద్దిరెడ్డి ఫ్యామిలీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. సొంత నియోజకవర్గం పుంగనూరుతోనే బంధం కట్ అయ్యేలా సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు. ఆ మధ్య పెద్దిరెడ్డి పుంగనూరు వెళ్లాలని చూస్తే స్థానికంగా అడ్డుకున్నారు.

ఇపుడు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వచ్చినా అదే పరిస్థితి. దానికి తోడు టీడీపీ వారు కూడా నిలదీయడంతో అడుగడుగునా ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ మొత్తం పరిణామాలను చూస్తే పుంగనూరు కింగ్ గా అధికారం యధేచ్చగా చలాయించిన పెద్దిరెడ్డి ఫ్యామిలీకి ఇపుడు పూలమ్మిన చోటనే కట్టెలమ్మే పరిస్థితి వచ్చిందా అన్న చర్చ సాగుతోంది.

తండ్రీ కొడుకులు ఇద్దరూ టీడీపీ కూటమి ప్రభంజనంలో గెలిచారు. కానీ ప్రజాభిమానం మాత్రం కోల్పోతున్నారని అంటున్నారు. గతంలో చేసిన తప్పులు ఇపుడు ఎదురై ప్రశ్నిస్తున్నాయని అంటున్నారు. టీడీపీ కూటమి కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఉచ్చు బిగిస్తోంది. దాంతో వీటి నుంచి ఎలా తప్పించుకుంటారు అన్నది చర్చగా ఉంది. చంద్రబాబు చిరకాల ప్రత్యధి ఇలా హ్యాండ్సప్ అవుతాడాని ఎవరూ ఊహించలేదు అంటున్నారు. కాలం మహిమ అని అనుకోవాల్సిందే అని కూడా వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News