తాంబూలాలిచ్చేశాం.. త‌న్నుకు చావండి!

దీంతో పిఠాపురం, తాడేప‌ల్లిగూడెం, గుంటూరు ప‌శ్చిమ‌, కొవ్వూరు వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు.

Update: 2024-03-15 04:10 GMT

తాంబూలాలిచ్చేశాం.. త‌న్నుకు చావండి! అన్న‌ట్టుగానే ఉంది టీడీపీ ప‌రిస్థితి. కీల‌క‌మైన ఎన్నిక‌ల ముంగిట .. పార్టీ బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షాలు ఉంటేనే త‌ప్ప‌.. వైసీపీ ని ఓడించ‌లేమ‌ని నిర్ణ‌యించుకుంది. ఇది త‌ప్పుకాదు. అయితే.. మిత్ర‌ప‌క్షాల‌కు టికెట్లు కేటాయించాల్సిన అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై ముందుగానే క‌స‌ర‌త్తు చేయ‌డం.. వాటిని ఎందుకు ఇవ్వాల్సి వ‌స్తోందో చెప్ప‌డం ద్వారా.. ముందుగానే త‌మ్ముళ్ల‌ను మెప్పించ‌డంలో పార్టీ పూర్తిగావిఫ‌ల‌మైంది.

దీంతో తీరా టికెట్లు ఎనౌన్స్ చేసే స‌మ‌యానికి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆగ్ర‌హావేశాలు పెల్లుబుకుతున్నాయి. తొలి జాబితాలో 94 స్థానాలు ప్ర‌క‌టించినప్పుడు కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమిత మైన త‌మ్ముళ్ల ఆగ్ర‌హం తాజాగా ప్ర‌క‌టించిన 34 స్థానాల వ్య‌వ‌హారంతో మ‌రింత పెరిగిపోయింది. దీంతో పిఠాపురం, తాడేప‌ల్లిగూడెం, గుంటూరు ప‌శ్చిమ‌, కొవ్వూరు వంటి కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు.

పిఠాపురాన్ని మిత్ర‌పక్షంలో భాగంగా జ‌న‌సేన‌కు కేటాయించారు. ఇక్క‌డ నుంచి ఏకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తాన‌ని చెప్పారు. అయితే, ఇక్క‌డ పెద్ద ముస‌ల‌మే పుట్టింది. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీకి సేవ చేసిన ఎస్‌వీ స‌త్య‌నారాయ‌ణ వ‌ర్మ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌, ఆయ‌న అనుచ‌రులు.. పార్టీ కార్యాల‌యం పై దండెత్తారు. జెండాలు త‌గుల బెట్టారు. చంద్ర‌బాబు కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. మ‌రోవైపు వ‌ర్మకు వైసీపీ నుంచి పిలుపు వ‌చ్చింది. ఈ ప‌రిణామాలు పార్టీలో తీవ్ర క‌ల‌కం రేపాయి.

అదేవిధంగా ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు ప్ర‌క‌టించ‌ని పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో త‌న పేరుపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన బోడే ప్ర‌సాద్‌కు చంద్ర‌బాబు ఫోన్ చేసి మ‌రీ టికెట్ లేద‌ని చెప్ప‌డంతో ఆయ‌న నిప్పులు చెరిగారు. ఆయ‌న కూడా పార్టీ మారేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.

ఇక‌, గుంటూరు ప‌శ్చిమ‌లోనూ నిన్న మొన్న‌టి వ‌ర‌కు పార్టీకి సేవ‌లుచేసిన మ‌న్న‌వ మోహ‌న్‌కృష్ణ కూడా త‌న‌కు అన్యాయం చేశారంటూ.. నిప్పులు చెరుగుతున్నారు. పార్టీ కోసం ప‌నిచేసిన వారికి ఇదేనా మ‌ర్యాద అంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ టికెట్ల కేటాయింపు ఎలా ఉన్నా.. త‌మ్ముళ్ల‌ను ముందుగానే స‌రిచేసుకుని.. వారిని ఒప్పించి ఉంటే బాగుండేద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags:    

Similar News