నోరు జారిన బండారు... సుప్రీం దాకా ?

మాజీ మంత్రి టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి నోరు జారారు.

Update: 2023-10-08 10:30 GMT

మాజీ మంత్రి టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణమూర్తి నోరు జారారు. అది కూడా చాలా దారుణంగా. బూతులతో లంకించుకున్నారు. ఆయన మాటలు ఆయన ఆవేశం అన్నీ కూడా నాడు మీడియా ముందు ప్రదర్శించారు. సీన్ కట్ చేస్తే అరెస్ట్ అయి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక ఈ కధ ఇంతే అనుకున్నారు.

కానీ ఫైర్ బ్రాండ్ రోజా అయితే అసలు ఊరుకోను అంటున్నారు. బండారు బండారం ఇక్కడ కాదు సుప్రీం కోర్టు దాకా లాగి పూర్తి న్యాయం దక్కేవరకూ పోరాడుతాను అని ఆమె దాదాపుగా శపధమే చేస్తున్నారు. బండారు ఒక్కరే కాదు ఇక మీదట ఏ నాయకుడు కూడా మహిళల మీద మాట్లాడాలీ అంటే భయం పుట్టేలా చట్టాలు ఉండాలని ఆమె అన్నారు.

అసభ్య దూషణ చేసిన వారు ఎంతటి వారు అయినా మహిళను ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆ దిశకు చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని తక్షణ రిమాండ్‌కు తరలించేలా చట్టాలు కఠినంగా ఉండాలన్నారు.

బండారు కేవలం బూతులు తిట్టలేదని ఏకంగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని రోజా మండిపడుతున్నారు. సమాజంలో రాజకీయాలలో బండారు లాంటి చీడ పురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను మాజీ మంత్రి బండారును వదిలే ప్రసక్తే లేదని, పూర్తి స్థాయిలో న్యాయ పోరాటం చేస్తానని మంత్రి రోజా స్పష్టం చేశారు.

ఈ మొత్తం విషయాన్ని దేశ అత్యున్నత న్యాయ స్థాం దాకా తీసుకుని వెళ్తామని బండారుపై క్రిమినల్, సివిల్ పరువునష్టం దావాలు వేస్తానని రోజా తెలిపారు మొత్తం మీద చూసుకుంటే బండారు వ్యవహారం రోజు రోజుకీ మరింతగా ముదురుతోంది. ఆయనను విమర్శిస్తూ రోజాకు మద్దతుగా నటీమణులు అంతా ముందుకు వచ్చారు.

ఇపుడు రోజా బండారు మీద కేసు ఫైల్ చేయబోతున్నారు. రానున్న రోజులలో బండారుకు కొత్త తలకాయ నొప్పులు చాలానే ఎదురవుతాయని అంటున్నారు. పెందుర్తి సీటు కోసం బండారు చేసిన ఈ అతి ఉత్సాహం కాస్తా ఇపుడు రివర్స్ అవుతోంది. ఇప్పటికే ఆయన సీటు చిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెందుర్తి సీటు జనసేనకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. అది చాలదు అన్నట్లుగా బండారు మీద కేసులు నమోదు అయితే ఆయన ఇంకా పీకల్లోతు కష్టాలలో పడినట్లే అంటున్నారు. ఏడు పదులకు చేరువ అవుతున్న బండారు రాజకీయంగా తన నష్టాలను తానే కోరి తెచ్చుకున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. మహిళల మీద విమర్శలు చేసేటపుడు నోరు అదుపులో ఉంచుకోవాలన్న ఆలోచన లేకుండా మాజీ మంత్రి చేసిన దానికి ఇపుడు రోజా సుప్రీం ని ఆశ్రయించనున్నారు అని అంటున్నారు.

Tags:    

Similar News