స‌భ‌లు ముగిశాయి.. మంత్రులు.. ఎమ్మెల్యేల‌కు బాబు సెల‌విచ్చారా?

ఏపీ శాస‌న స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిశాయి. సోమ‌వారం ప్రారంభ‌మైన స‌మావేశాలు.. శుక్ర‌వారం వ‌ర‌కు జ‌రిగాయి

Update: 2024-07-26 15:07 GMT

ఏపీ శాస‌న స‌భ బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిశాయి. సోమ‌వారం ప్రారంభ‌మైన స‌మావేశాలు.. శుక్ర‌వారం వ‌ర‌కు జ‌రిగాయి. మొత్తం 7 శాఖ‌ల‌కు సంబంధించిన శ్వేత ప‌త్రాల‌ను సీఎం చంద్ర‌బాబు, ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్‌, ఇత‌ర మంత్రులు స‌భ ముందు కు తీసుకువ‌చ్చారు. వాటిపై చ‌ర్చించారు. ఇక‌, స‌భ‌లు ముగిసిన త‌ర్వాత‌.. మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ పొలో మంటూ.. విజ‌య‌వాడ శివారులోని గ‌న్న‌వ‌రం విమానాశ్రయానికి క్యూ క‌ట్టారు. శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో విజ‌య‌వాడ‌-హైదరాబాద్ విమానం ఫుల్ అయిపోయింది.

అదేవిధంగా విజ‌య‌వాడ‌-జైపూర్ ప్ర‌త్యేక విమానం కూడా మంత్రులు, ఎమ్మెల్యేల‌తో కిట‌కిట‌లాడింది. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ.. విశ్రాంతి కోసం.. హైద‌రాబాద్‌, జైపూర్‌ల‌కు త‌ర‌లి వెళ్లారా? అనే చ‌ర్చ టీడీపీ వ‌ర్గాల్లో వినిపించింది. వీరిలో జ‌న‌సేన మంత్రులు, బీజేపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇక‌, టీడీపీలో ఉన్న నారా లోకేష్ స‌హా ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, గొట్టిపాటి ర‌వి, స‌విత ఇలా అంద‌రూ విమానాశ్ర‌యంలో ద‌ర్శ‌న‌మిచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల రాక‌తో గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం కూడా.. కిట‌కిట‌లాడింది.

దీంతో ఐదు రోజుల స‌భ‌ల త‌ర్వాత‌.. వీరంతా విశ్రాంతి, విహారాల కోసం.. పొరుగు ప్రాంతాల‌కు వెళ్తున్నార‌ని.. కొంద‌రు వ్యాఖ్యానిం చారు. నారా లోకేష్ హైద‌రాబాద్‌కు వెళ్ల‌గా, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, నాదెండ్ల మ‌నోహ‌ర్‌, స‌విత స‌హా ఇత‌ర కొంద‌రు మంత్రు లు జైపూర్ వెళ్లే విమానాన్ని ఎక్కారు. దీంతో వీరు విహారానికి వెళ్తున్నార‌ని కొంద‌రు భావించారు. మ‌రికొంద‌రు హైద‌రాబాద్ ఫ్లైట్ ఎక్కారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వారికి సెల‌వు ఇచ్చి ఉంటార‌ని.. వ‌రుస‌గా ఐదు రోజుల పాటు స‌భ‌కు వ‌చ్చి.. చ‌ర్చ‌ల్లో పాల్గొన్న నేప‌థ్యంలో కొంత విరామం ప్ర‌క‌టించి ఉంటార‌ని.. టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఏదేమైనా.. ఐదు రోజుల త‌ర్వాత‌.. మంత్రులు క్యూ క‌ట్టిన‌ట్టుగా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యానికి రావ‌డంతో ఇక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. భారీ సంఖ్య‌లో పార్టీ అభిమానులు హాజ‌రై త‌మ అభిమాన నాయ‌కుల‌తో సెల్పీలు దిగారు. మ‌రికొంద‌రు ఇదే స‌రైన స‌మ‌యం అనుకుని త‌మ త‌మ స‌మ‌స్య‌ల‌కు సంబందించిన విన‌తి ప‌త్రాల‌ను మంత్రుల‌కు అందించారు. వీరిలో నారా లోకేష్‌కు ఎక్కువ మంది విన‌తి ప‌త్రాలు ఇవ్వ‌డం, సెల్ఫీలు దిగ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News