టీడీపీకి సొంతమనుకునే వర్గ నేతలే ప్రత్యర్ధులు...?
దాంతో టీడీపీ ఆవిర్భవించడంలో ఇంధనంగా ఆ సామాజికవర్గం కీలకమైన పాత్ర పోషించింది. అది నాలుగు దశాబ్దాలుగా కంటిన్యూ అవుతూ వస్తోంది.
తెలుగుదేశం పార్టీ పుట్టుక వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఆంధ్రుల ఆత్మ గౌరవం తెలుగు జాతి పౌరుషం వంటివి ఎన్నో ఉన్నా వీటితో పాటు మరో అతి ముఖ్యమైన కారణం ఉంది. అప్పటికి మూడున్నర పదుల కాంగ్రెస్ ఏలుబడిలో కమ్మలకు సీఎం అయ్యే చాన్స్ దక్కలేదు. కాంగ్రెస్ లో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం వల్ల వాళ్లే ముఖ్యమంత్రులు అవుతున్నారు. దాంతో అప్పటి కాంగ్రెస్ లో ఉన్న నాదెండ్ల భాస్కరరావు లాంటి వారు అవమానంగా ఫీల్ అయ్యారు.
వారు బయటకు వచ్చారు అలా కొంత వాతావరణం సామాజికపరంగా టీడీపీకి అనుకూలంగా మారింది. దాంతో టీడీపీ ఆవిర్భవించడంలో ఇంధనంగా ఆ సామాజికవర్గం కీలకమైన పాత్ర పోషించింది. అది నాలుగు దశాబ్దాలుగా కంటిన్యూ అవుతూ వస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నది.
ఆ క్రమంలో ఎక్కువగా సొంత సామాజికవర్గం నేతలే ఆ పార్టీ అధినాయకత్వానికి ఝలక్ ఇచ్చారు. 1984లో నాదెండ్ల భాస్కరరావు అలా వెన్నుపోటు పొడిస్తే 1995లో చంద్రబాబు టీడీపీలో సంక్షోభానికి కారణం అయ్యారు. మళ్లీ అలాంటి కుదుపు అయితే వెలమ సామాజికవర్గానికి చెందిన కేసీయార్ తోనే టీడీపీకి ఎదురైంది.
ఆయన ప్రత్యేక తెలంగాణా ఉద్యమంతో తెలంగాణాలో టీడీపీ పునాదులే పెకిలించే ప్రయత్నం చేశారు. అందులో తొంబై శాతం పైగా సక్సెస్ అయ్యారు. ఈ రోజు టీడీపీ అక్కడ నామమాత్రంగానే మిగిలింది. ఇక ఏపీలో టీడీపీకి ఈ రోజుకూ కమ్మ సామాజికవర్గం వెన్నుదన్నుగా ఉంది. అయితే టీడీపీ నుంచి బయటకు వస్తూ పెను సవాల్ గా మారింది కూడా అదే సామాజికవర్గానికి చెందిన నేతలు కావడం విశేషం.
అలా చూసుకుంటే కనుక ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీ కనిపిస్తారు. ఈ ఇద్దరూ ఇపుడు వైసీపీలో ఉన్నారు. టీడీపీ ఏ వైసీపీని అయితే ఎదిరించాలని చూస్తుందో ఆ వైసీపీలోకి ఈ నాయకులు నిలబడి టీడీపీని సవాల్ చేస్తున్నారు. ఇక ఇపుడు మరో ఉపద్రవం టీడీపీకి వచ్చినట్లుగా ఉంది.
ఇద్దరు కీలక ఎంపీలు టీడీపీకి దూరంగా ఉంతున్నారు. వారిలో ఒకరు గల్లా జయదేవ్ అయితే మరొకరు కేశినేని నాని, ఈ ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నేతలే. రెండు కీలకమైన జిల్లాలు, టీడీపీకి బలమున్న జిల్లాలలో ఈ ఎంపీలు పార్టీ యాక్టివిటీకి దూరంగా జరగడం ఏ రకమైన సంకేతం అన్న ప్రశ్న వస్తోంది. ఈసారి ఎలాగైనా టీడీపీని గెలిపించుకోవాలని ప్రవాసంలో ఉన్న కమ్మ సామాజికవర్గం నేతలు అంతా ఏకమవుతున్నారు.
వారే ఆర్ధికంగా అన్ని రకాలుగా టీడీపీకి అండగా నిలుస్తూ వస్తున్నారు అని అంటున్నారు. ఈ దశలో పార్టీలో ఉన్న ఆ సామాజికవర్గం నేతలు ఎందుకు దూరం అవుతున్నారు అన్నది ఆలోచించాల్సిన విషయమే. అధికారం కోసం డూ ఆర్ డై అన్నట్లుగా టీడీపీ పోరాడుతున్న నేపధ్యంలో ఆ పార్టీకి బేస్ గా ఉంటూ వస్తున్న సామాజికవర్గం నుంచి నేతలు అగ్ర నాయకులు వేరుగా కనిపిస్తే అది ఇబ్బందిగా మారుతుంది అని అంటున్నారు.
ఇక పార్టీలో పోకడలు కొత్తరకంగా పోవడం వల్లనే ఈ ఇద్దరు ఎంపీలు దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. గతంలో అయితే పార్టీ ఎలాంటి అసంతృప్తులు ఉన్నా తొలగించే ప్రయత్నం చేసేదని, ఇపుడు అలాంటి కనిపించడంలేదని అంటున్నారు. దానికి కారణం ఏమిటి అన్నది చూడాలని అంటున్నారు. టీడీపీలో చంద్రబాబు పట్టు క్రమంగా తగ్గడం లోకేష్ పట్టు పెరగడం వల్ల కూడా ఇలాంటి గ్యాప్స్ ఎక్కువ అయ్యాయా అన్నది కూడా మరో ప్రచారంగా ఉంది అంటున్నారు. ఏది ఏమైనా 2024 ఎన్నికల వేళ టీడీపీకి ఈ పరిణామాలు మంచివి కావనే అంటున్నారు.