సైకిల్ ఏమిచేస్తుందో తెలీటంలేదు

ఇపుడు తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఏమి చేయబోతోంది ? అన్నదే ఇపుడు అంతుపట్టడం లేదు.

Update: 2024-03-13 04:20 GMT

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో సైకిల్ పార్టీ ఏమి చేస్తుందో తెలీటంలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిముషంలో సైలెంటుగా ఉండిపోయింది. అప్పటివరకు ఒంటరిగానే పోటీచేస్తామని చెప్పిన నేతలు తీరా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత చివరి నిముషంలో పోటీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించేందుకు టీడీపీ పోటీనుండి తప్పుకుందన్న ప్రచారం అందరికీ తెలిసిందే. కారణం ఏదైనా పోటీలో నుంచి టీడీపీ తప్పుకోవటం వాస్తవం.

ఇపుడు తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ ఏమి చేయబోతోంది ? అన్నదే ఇపుడు అంతుపట్టడం లేదు. అప్పుడంటే కాంగ్రెస్ కు మేలు చేసేందుకే పోటీలో నుండి తప్పుకున్నారనే ప్రచారం జరిగినా తమ్ముళ్ళు పట్టించుకోలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో అలా చేసేందుకు లేదు. ఎందుకంటే ఇపుడు టీడీపీ ఎన్డీయేలో అధికారికంగా పార్టనర్ కాబట్టి. అందుకనే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి వైసీపీని ఎదుర్కోబోతోంది. బీజేపీ, టీడీపీ పార్టనర్స్ అయిపోయిన తర్వాత తెలంగాణా ఎన్నికల్లో కూడా అదే కూటమి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తుందా అనే చర్చ పెరిగిపోతోంది.

ఏపీలో పొత్తులపై బీజేపీ నేతలు చాలా మాటలే మాట్లాడారు. మరలాంటి మాటలను తెలంగాణ లో కమలనాథులు ఎవరూ మాట్లాడటం లేదు. అంటే ఇప్పటికే 9 పార్లమెంటు సీట్లను బీజేపీ ప్రకటించేసింది. మొత్తం 17 సీట్లలో తొమ్మిది చోట్ల అభ్యర్థులను ప్రకటించారంటే 60 శాతం నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఫైనల్ అయిపోయినట్లే. మిగిలిన 8 సీట్లలో మాత్రమే అభ్యర్ధులను ప్రకటించాల్సుంది. ఇప్పటికిప్పుడు బీజేపీతో టీడీపీ, జనసేన జట్టుకడతాయా ? కట్టవా ? అన్న అయోమయం పెరిగిపోతోంది.

ఇపుడు తెలంగాణా టీడీపీకి అధ్యక్షుడు కూడా ఎవరు లేరు. అసెంబ్లీ ఎన్నికల పోటీ నుండి తప్పుకున్న కారణంగా అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ తప్పుకున్నారు. అప్పటినుండి కొత్తగా అధ్యక్షుడిని నియమించలేదు. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు తరుముకొచ్చేస్తున్నాయి. షెడ్యూల్ కూడా నాలుగైదు రోజుల్లో ప్రకటన ఖాయమంటున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఏపీలో పొత్తుల విషయం తేలిన తర్వాత అదే పొత్తును తెలంగాణాలో రిపీట్ చేసే విషయంలో మాత్రం అయోమయం పెరిగిపోతోంది. అందుకనే సైకిల్ పార్టీ స్టాండ్ ఏమిటో ఎవరికీ అర్ధంకావటంలేదు.

Tags:    

Similar News