స‌ర్వం హైడ్రామ‌యం: సీఎం సోద‌రుడి కామెంట్స్‌.. సీఎస్ రివ్వూ.. హైకోర్టు స్టేట్‌మెంట్

తెలంగాణ గురించి ఇప్పుడు ఏ ఇద్ద‌రు మాట్లాడుతున్నా.. హైడ్రా అంశ‌మే హైలెట్‌.

Update: 2024-08-29 10:53 GMT

తెలంగాణ గురించి ఇప్పుడు ఏ ఇద్ద‌రు మాట్లాడుతున్నా.. హైడ్రా అంశ‌మే హైలెట్‌. దేశ విదేశాల్లోని తెలంగాణ వారి నుంచి తెలుగువారి వ‌ర‌కే కాదు.. పారిశ్రామిక వేత్త‌లు, మిలియ‌నీర్లు కూడా హైడ్రా గురించే ఆరా తీస్తున్నారు. దీనిపైనే చ‌ర్చించుకుంటున్నారు. గ‌త‌రెండు నెల‌లుగా హైడ్రా దూకుడుగా ఉన్నా.. ఇటీవ‌ల అక్కినేని నాగార్జునకు చెందిన `ఎన్‌` క‌న్వెన్ష‌న్ కూల్చి వేత త‌ర్వాత‌.. మ‌రింత‌గా దీనిపై చ‌ర్చ సాగుతోంది. ఎన్ని వ‌త్తిళ్లు వ‌చ్చినా.. వెన‌క్కి త‌గ్గేది లేద‌ని సీఎం రేవంత్ చెప్పిన విష‌యం తెలిసిందే.

అనంత‌రం.. హైడ్రా మ‌ల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే రాజ‌శేఖ‌ర‌రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. క‌థ ఇక్క‌డితో అయిపోలేదు. దుర్గం చెరువులో నిర్మించిన సొసైటీ ఇంటిని కొనుగోలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సోద‌రుడికి కూడా నోటీసులు ఇచ్చింది. దీంతో హైడ్రా దూకుడుకు ఇంకా ప‌దును పెరిగింది. దుర్గం చెరువులోని అమ‌ర్ సొసైటీలో రేవంత్ సోద‌రుడు తిరుప‌తి రెడ్డి ఇల్లు కొన్నారు. దీనికి తాజాగా నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు.. నెల రోజుల్లో కూల్చివేయాల‌ని పేర్కొన్నారు.

దీనిని తిరుప‌తి రెడ్డి పాజిటివ్‌గా తీసుకున్నారు. 2015లోనే తాను అమర్ సొసైటీలో ఇంటిని కొన్నాన‌ని ఆయ‌న చెప్పారు. అయితే.. అప్ప‌ట్లో ఇది .. ఎఫ్ టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవిల్‌-చెరువులు, స‌ర‌స్సులు పూర్తిగా నీటిని నింపుకొనే ప్రాంతం లేదా ప‌రిధి.. అంటే.. చెరువుల విస్తార ప‌రిధి!) పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదన్నారు. హైడ్రా నోటీసులతోనే ఆ విష‌యం త‌న‌కు తెలిసింద‌న్నారు. అయితే.. త‌ప్పు ఎప్పుడు బ‌య‌ట ప‌డినా త‌ప్పే కాబ‌ట్టి.. ఇత‌రుల విష‌యంలో హైడ్రా వ్య‌వ‌హ‌రించిన‌ట్టే త‌న విష‌యంలోనూ వ్య‌వ‌హ‌రించాల‌ని తిరుప‌తి రెడ్డి తేల్చి చెప్పారు.

హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు..

హైడ్రా చ‌ర్య‌లను నిలిపివేయాల‌న్న వ్యాజ్యాల‌పై తాజాగాహైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌కృతిని, ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించే క్ర‌మంలో ప్ర‌భుత్వం ఒక్కొక్క‌సారి క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని.. దీనిని తాము ఆప‌లేమ‌ని.. అయితే.. చ‌ట్ట ప‌ర‌మైన నిబంధ‌న‌ల‌ను మాత్రం పాటించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పింది. చెరువులు, స‌ర‌స్సును ప‌రిర‌క్షించ‌క‌పోతే.. ప్ర‌కృతి అనే మాట‌కు అర్థం లేద‌ని హైకోర్టు తేల్చి చెప్పింది.

సీఎస్ స‌మీక్ష‌..

హైకోర్టు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంత కుమారి ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. దీనికి హైడ్రా అధికారులు కూడా హాజ‌ర‌య్యారు. కూల్చివేత‌ల విష‌యంలో చ‌ట్టాన్ని అనుస‌రించాల‌ని.. న్యాయ ప‌ర‌మైన చిక్కులు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆమె అధికారుల‌కు సూచించారు. ప్ర‌భుత్వానికి ఇబ్బంది క‌లిగించేలా.. ఎవ‌రూ వ్య‌వ‌హ‌రించ‌రాద‌ని కూడా తేల్చి చెప్పారు. సో.. మొత్తంగా.. అటు నాయ‌కులు, ఇటు పాల‌కులు.. అంద‌రిదీ.. హైడ్రా మాటే!!

Tags:    

Similar News