తెలంగాణకు రెడ్ అలెర్టు.. సోమవారం స్కూళ్లకు సెలవు ఎందుకంటే?
ఉత్తర బంగాళాఖాయంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం తెలంగాణ మీదా పడింది. ఇప్పటికే ఏపీని ముంచెత్తిన వానలు.. తెలంగాణలో మొదలు కావటం తెలిసిందే
ఉత్తర బంగాళాఖాయంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం తెలంగాణ మీదా పడింది. ఇప్పటికే ఏపీని ముంచెత్తిన వానలు.. తెలంగాణలో మొదలు కావటం తెలిసిందే. వర్ష ప్రభావం శనివారం తెలంగాణ మీద చూపగా.. తాజాగా వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం ఆది.. సోమవారాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రెడ్ అలెర్టును ప్రకటించారు. శనివారం నుంచి కురుస్తున్న వానతో ఇప్పటికే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకల అంతరాయం ఏర్పడింది.
శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హూజూర్ నగర్ లో 29.3 సెంటీమీటర్లు.. చిలుకూరులో 28.2 సెంటీమీటర్ల వాన పడింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 21.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవేగాక ఖమ్మం.. సూర్యాపేట.. వరంగల్.. కామారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో ఆది.. సోమవారాల్లో భారీ నుంచి అతి భారీగా వానలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వర్షకారణంగా తెలంగాణ వ్యాప్తంగా చోటుచేసుకున్నపలు పరిణామాల్లో అతి ముఖ్యమైనవి చూస్తే..
- కోదాడ మండలంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహడాదిపై చెరువు నీరు నిలిచిపోవటం.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
- హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే అన్ని వాహనాల్ని నార్కెట్ పల్లి నుంచి వయా మిర్యాలగూడ.. గుంటూరు మీదుగా తరలిస్తున్నారు.
- మధిర మున్సిపాలిటీలోని పలు కాలనీల్లోకి నీళ్లు వచ్చి చేరాయి.
- సత్తుపల్లి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
- వర్షాల కారణంగా ఏర్పడిన వరద కారణంగా వైరా - మధిర మధ్య రాకపోకల్ని నిలిపేశారు.
- మేడిగడ్డ బ్యారేజీ వద్ద 1.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అంతే స్థాయిలో కిందకు వదిలేస్తున్నారు
- నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వరద.. డ్రైనేజీ నీళ్లు ఇళ్లల్లోకి చేరుతున్న దుస్థితి.
- మెదక్ జిల్లాలో ఈసా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉప్పొంగుతోంది.
- తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వాన కారణంగా పలు రైళ్లను.. శని.. ఆది.. సోమవారాల్లో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- వాయుగుండం నేపథ్యంలో తెలంగాణలోని 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్టు జారీ చేసింది.
- ఆదిలాబాద్.. నిర్మల్.. నిజామాబాద్.. కామారెడ్డి.. మహబూబ్ నగర్.. నాగర్ కర్నూల్.. వనపర్తి.. నారాయణపేట.. జోగులాంబ గద్వాల జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతవరణ శాఖ నిపుణఉలు చెబుతున్నారు.
- లోతట్టు ప్రాంతాలు.. రోడ్లు. లోలెవల్ వంతెనలు మునిగే దుస్థితి.
- తాజాగా కురిసే భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం కూడా స్కూళ్లకు ముందుగానే సెలవు ప్రకటించేశారు.
- తెలంగాణలో శనివారం భారీగా కురిసిన వర్షాల్లో అత్యధికంగా నమోదైన ప్రాంతాలు చూస్తే.. హుజూర్ నగర్ (29.3), చిలుకూరు (సూర్యాపేట జిల్లా) 28.2, తాడ్వాయి 23, ఎర్రుపాలెం (ఖమ్మం జిల్లా)లో 21.3, మధిరలో 18.4, మఠంపల్లి (సూర్యాపేట జిల్లా) 17.2, తొగర్రి (సూర్యాపేట) 16, ఏటూరు నాగారం 15.1, బొమ్మనదేవిపల్లి (కామారెడ్డి జిల్లా)లో 14, రెడ్లవాడ(వరంగల్)లో 13, అనంతగిరి (సూర్యాపేట)లో 11.5, అడ్డగూడూర్ (యాదాద్రి జిల్లా) 10.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక.. పది సెంటీమీటర్ల వర్షం కురిసిన ఇతర ప్రాంతాల్లో సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరి, జనగాం జిల్లాలో కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు, ఇదే జిల్లాకు చెందిన తొర్రూరు, నల్గొండ జిల్లాలోని కొండమలపల్లిలోనూ భారీ వర్షం కురిసింది.