తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బిగ్ అప్ డేట్!
ఈ ఏడాది డిసెంబర్ లోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు
ఈ ఏడాది డిసెంబర్ లోగా తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. దాన్ని లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినా ఈ ఎన్నికలకు అమల్లోకి రాదని.. 2029 ఎన్నికల నాటికే అమల్లోకి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలకు అడ్డు తొలగిపోయినట్టేనని భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటికే అధికార పార్టీ బీఆర్‌ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నాయి. అలాగే ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోల విడుదలకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే మేనిఫెస్టోల రూపకల్పన పూర్తయిందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోందని సమాచారం. జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్ ప్రస్తుతం ఉండే అవకాశం లేకపోవడంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 6న ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రానున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది, పోలీసు బందోబస్తు వంటి పలు అంశాలను ఎన్నికల సంఘం అధికారులు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారులు నివేదికను సమర్పిస్తారు. ఆ తర్వాత వెనువెంటనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 6న షెడ్యూల్ వెలువడటం ఖాయమని టాక్ నడుస్తోంది. ఒకవేళ అక్టోబర్ 6న వీలు కాకపోతే అక్టోబర్ 10న ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్ వెలువడవచ్చని చెబుతున్నారు. ఈ రెండు తేదీల్లోనే ఏదో ఒక రోజున షెడ్యూల్ ప్రకటన ఉంటుందని అంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ఇచ్చిన నెల తర్వాత అంటే నవంబర్ 10 నాటికి ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారని సమాచారం. అందులోనే నామినేషన్లకు తేదీలు, ఉపసంహరణకు తేదీలు, ఎన్నికల నిర్వహణ తేదీ, ఫలితాల ప్రకటన తేదీలను ప్రకటిస్తారు. నామినేషన్ల స్వీకరణ నుంచి నెలరోజుల్లోగా ఎన్నికల ప్రక్రియను మొత్తం పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే డిసెంబర్ 10 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. డిసెంబర్ 10 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్నారు.
2018 ఎన్నికల తర్వాత జనవరి 16న శాసనసభ తొలి సమావేశం నిర్వహించారు. దీన్ని బట్టి.. 2024 జనవరి 17లోపు కొత్త శాసనసభ సమావేశం కావాల్సి ఉంటుందని చెబుతున్నారు. అందుకనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది.