టికెట్ల కోసం 6 వేల దరఖాస్తులు.. అన్నింటినీ చూస్తారా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో పొలిటికల్ సందడి నెలకొంది. పార్టీలన్నీ గెలుపు వ్యూహాల్లో మునిగిపోయాయి

Update: 2023-09-11 17:30 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండటంతో పొలిటికల్ సందడి నెలకొంది. పార్టీలన్నీ గెలుపు వ్యూహాల్లో మునిగిపోయాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించి రేసులో దూసుకెళ్తోంది. టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ వడపోత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానించగా భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

బీజేపీ టికెట్ కోసం మామూలు స్థాయిలో పోటీ లేదు. ఏకంగా 6,003 దరఖాస్తులు వచ్చినట్లు బీజేపీ వర్గాలు చెప్పాయి. 119 స్థానాల కోసం 6,003 దరఖాస్తులు రావడం ఊహించని పరిణామమే. అయితే టికెట్ దరఖాస్తు కోసం కాంగ్రెస్ లాగా బీజేపీ ఎలాంటి ఫీజు నిర్ణయించకపోవడమే భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడానికి కారణంగా చెబుతున్నారు. దీంతో ఎవరు పడితే వాళ్లు టికెట్ కోసం దరఖాస్తులు సమర్పించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చోటా మోటా నేతలు కూడా టికెట్ రేసులో నిలిచారని చెబుతున్నారు.

దరఖాస్తులు సమర్పణకు భారీ స్పందన వచ్చిందని బీజేపీ సంబరపడుతుంది సరే.. కానీ ఇప్పుడు వీటి నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడం చాలా కష్టమన్న అభిప్రాయాలున్నాయి. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి అభ్యర్థి బలబలాలు, నియోజకవర్గాల వారీగా వడపోత నిర్వహించేందుకు స్క్రీనింగ్ కమిటీని నియమిస్తామని బీజేపీ చెబుతోంది. కానీ ఇన్ని వేల దరఖాస్తులను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందా? అన్నది ఇక్కడ ప్రశ్న.

ఇప్పటికే దాదాపు మోజారిటీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై బీజేపీ అధిష్ఠానం ఓ అంచనాకు వచ్చిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తుల ప్రక్రియ ద్వారా హడావుడి చేయడం మినహా ఎలాంటి ప్రయోజనం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే దరఖాస్తుకు ఇంత అని ఫీజు నిర్ణయిస్తే ఇన్న అప్లికేషన్లు వచ్చేవా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News