తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి వ్యవహారం కాక రేపుతోందిగా!
ఈ నేపథ్యంలో గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్మే రాజా సింగ్ కలకలం రేపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.
తెలంగాణలో బీజేపీ మంచి ఫలితాలను సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ఇంకొన్ని స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది.
ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన పని పడింది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు ఈ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ప్రధానంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన వెంకట రమణారెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు.
అయితే కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేశాక కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఈటల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఈటల రాజేందర్ కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఉప ఎన్నికలతో కలిపి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీచేసిన ఆయన రెండు చోట్లా ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కలకలం రేపారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడిగా నియమించాలని ఆయన కోరారు. దీన్ని బట్టి ఈటల రాజేందర్ అభ్యర్థిత్వానికి రాజా సింగ్ సానుకూలంగా లేరని అంటున్నారు. ఈటల 2001 నుంచి టీఆర్‌ఎస్ (ఇప్పుడు బీఆర్‌ఎస్)లో కొనసాగారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుంచి పలుమార్లు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేసీఆర్ రెండు మంత్రివర్గాల్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. కేసీఆర్ తో తలెత్తిన విభేదాలతో టీఆర్‌ఎస్ కు 2021లో రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరారు, ఉప ఎన్నికలో మరోమారు ఘనవిజయం సాధించారు.
ఈటల బీజేపీ ప్రథాన మూల సిద్ధాంతమయిన హిందుత్వకు సరిపోరనేది రాజాసింగ్ ఆంతర్యమని అంటున్నారు. ఎంపీగా గెలుపొందినవారికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వదలుచుకుంటే దేశం, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని రాజాసింగ్ కోరుతున్నారు. ఆయన ఉద్దేశం నిజామాబాద్ ఎంపీగా రెండోసారి గెలిచిన ధర్మపురి అరవింద్ కు బీజేపీ అధ్యక్ష పీఠం ఇవ్వాలనేదనని అంటున్నారు.
మరి ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. అధ్యక్ష పదవికి భారీగా ఆశావహులు ఉన్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానానికి ఈ వ్యవహారం కత్తిమీద సామే కానుందని అంటున్నారు.