తెలంగాణలో బీఎస్పీ దూకుడు... ఉచితంగా వాషింగ్ మెషిన్, ఫోన్!

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీ.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటేందుకు సిద్ధమైందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

Update: 2023-10-18 02:45 GMT

తెలంగాణ ఎన్నికల వాతావరణం రసవత్తరంగా మారిన నేపథ్యంలో... వరుస మేనిఫెస్టోలు హాట్ టాపిక్ లుగా మారుతున్నాయి. ఓటర్లను ఆకర్షించే క్రమంలో ఇప్పటికే బీఆరెస్స్ మేనిఫెస్టో ప్రకటించగా... కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో... బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా మేనిఫెస్టో ప్రక‌టించింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును.. నిన్నమొన్నటివరకూ బీఆరెస్స్, కాంగ్రెస్, బీజేపీ వంటి పార్టీలు ప్రవేశపెట్టిన, ప్రవేశపెట్టబోతోన్న మ్యానిఫెస్టోలపైనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో చప్పుడు లేని తుఫానుగా, సమాచారం లేని వాయుగుండంగా తెలంగాణ రాజకీయాల్లో ఎంటరైంది బీఎస్పీ మ్యానిఫెస్టో! ఈ మేనిఫెస్టో అందించిన తీరు చూస్తుంటే... ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీ.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటేందుకు సిద్ధమైందనే కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే 20 మందితో తొలి జాబితాను ప్రకటించిన బీఎస్పీ... మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో ప్రధానంగా విద్య, ఉద్యోగం, ఉపాధి అంశాలపై దృష్టి సారించారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆ మ్యానిఫెస్టో లో పొందుపరిచిన అంశాలను సవివరంగా పరిశీలిద్దాం!

"కాన్షీ" యువ సర్కార్: ఇందులో భాగంగా... యువతకు ఐదేళ్లలో పది లక్షల ఉద్యోగాలు.. అందులో ప్రత్యేకంగా మహిళలకు 5 లక్షల కొలువులు.. షాడో మంత్రులుగా విద్యార్థి నాయకులు!

"బహుజన" రైతుబీమా: ఈ పథకంలో భాగంగా ప్రతీ పంటకు కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయడంతోపాటు రైతులకు విత్తు నుంచి విక్రయం వరకు ఖచ్చితమైన ప్రభుత్వ రాయితీ అందించడం చేస్తారు. ఇదే సమయంలో ధరణి పోర్టర్ ను రద్దు చేస్తారు!

"దొడ్డి కొమురయ్య" భూమి హక్కు: ఇందులో భాగంగా... భూమిలేని ప్రతిపేద కుటుంబానికి 1 ఎకరం భూమి ఇస్తూ, మహిళల పేరిట పట్టా ఇవ్వబడుతోంది.

"చాకలి ఐలమ్మ" మహిళా జ్యోతి: మహిళా కార్మికులు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్లు ఇవ్వడంతోపాటు మహిళలకు స్మార్ట్‌ ఫోన్, ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇస్తారు. ఇదే సమయంలో... అంగన్వాడీ, ఆశా వర్కర్ల ఉద్యోగాల క్రమబద్దీకరణ!

"భీం" రక్షా కేంద్రాలు: వృద్ధులకు హాస్టల్, ఆహారం, ఉచిత వైద్యం.. రక్షా కేంద్రాల్లో వికలాంగులకు, ఒంటరి మహిళలకు తోడ్పాటు!

"పూలే" విద్యా దీవెన: మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూలు. ప్రతీ మండలం నుంచి ఏటా వంద మంది విద్యార్థులకు ఉచిత విదేశీ విద్య. అదేవిధంగా... డేటా ఏఐ, కోడింగ్‌ లో శిక్షణ!

"బ్లూ" జాబ్ కార్డ్: పల్లె, పట్టణాల్లో 150 రోజుల ఉపాధి హామీతో పాటు రోజూ కూలీ రూ.350 పెంపు. అదేవిధంగా... కూలీలకు ఉచిత రవాణా, ఆరోగ్యం, జీవిత బీమా.

"నూరేళ్ల" ఆరోగ్య ధీమా: ప్రతీ కుటుంబానికి రూ.15 లక్షల ఆరోగ్య భీమా.. ఏటా రూ.25 వేల కోట్లతో పౌష్టికాహార ఆరోగ్య బడ్జెట్!

వలస కార్మికుల సంక్షేమ నిధి: రూ.5 వేల కోట్లతో గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు.. గిగ్ కార్మికులు, లారీ, టాక్సీ డ్రైవర్లకు 600 సబ్సిడీ క్యాంటీన్లు!

"షేక్ బందగి" గృహ భరోసా: ఇళ్లు లేని వారికి 550 ఇంటి స్థలం కేటాయింపు.. ఇళ్లు కట్టుకునే వారికి రూ.6 లక్షల సాయం.. ఇంటి పునర్మిణానికి రూ.1.50 లక్షల సాయం!

ఈ సందర్భంగా ఈ వివరాలను వెల్లడించిన ఆర్.ఎస్.పీ... "పథకాల కొరకు ఎదురుచూసే బాధ లేకుండ విద్య, వైద్యం, ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా దార్శనిక దృష్టికి సాక్షమే బహుజన భరోసా. పాలనలో భాగస్వామ్యం సాధించి కొందరి గుప్పిళ్లలో ఉన్న తెలంగాణను విడిపించి, అందరి తెలంగాణను నిర్మించుకుందాం. అందరి తెలంగాణకు మన ఏనుగు గుర్తుని గెలిపించుకుందాం" అంటూ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News