హలో ఈసీ.. చలో ఢిల్లీ? పొలోమంటూ యావత్ తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ సచివాలయంలో శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు
ఇదో అరుదైన సీన్.. బహుశా యావత్ ప్రభుత్వమూ పొలోమంటూ ఎన్నికల సంఘం వద్దకు వెళ్లడం ఎప్పుడూ చూసి ఉండమేమో? కోడ్ అమల్లో ఉండగా, కేబినెట్ భేటీ నిర్వహించాలని భావించడం, దాని కోసం ఎన్నికల సంఘం అనుమతి అవసరం పడడం.. చివరకు రాత్రి వరకు మంత్రివర్గం అంతా ఎదురుచూడడం.. ఎంతకూ తెగకపోవడంతో ఇళ్లకు వెళ్లిపోవడం.. ఓ చిత్రమైన పరిస్థితే.
ఇంతకూ ఏ జరిగిందంటే..?
తెలంగాణ సచివాలయంలో శనివారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మంత్రులు సమావేశంలో పాల్గొనేందుకు సచివాలయానికి వచ్చారు. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో విధానపరమైన నిర్ణయాలకు అవకాశం లేదు. దీంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎదురుచూశారు.
కానీ, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు. చివరకు రాత్రి 7 గంటలకు సమావేశం వాయిదా వేసి ఇళ్లకు వెళ్లిపోయారు.
సమీక్షకే.. నిర్ణయాలకు కాదన్న రేవంత్..
లోక్ సభ ఎన్నికలకు తెలంగాణలో ఈ నెల 13న పోలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు రుణమాఫీతో పాటు ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలక విషయాలు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుండగా.. పునర్విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలను మంత్రి మండలి భేటీలో చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు ఎజెండా తయారు చేశారు.
అడ్డం పడిన కోడ్..
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతోపాటు వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీకి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసీని కోరింది. ఈ మేరకు అనుమతి వస్తుందని సీఎం, మంత్రులు సచివాలయానికి వచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని విభాగాల అధికారులూ చేరుకున్నారు. ఇదిగో ఇప్పుడే అనుమతి వస్తుందని.. వెంటనే సమావేశం జరపాలని భావించారు. రాత్రి 7 గంటల వరకు వేచి చూసి వాయిదా వేశారు.
సోమవారం వరకు నిరీక్షించి
ఈసీ ఎప్పుడు చెబితే అప్పుడే కేబినెట్ భేటీ జరపాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 20 (సోమవారం) లోగా ఈసీ స్పందించకుంటే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామన్నారు.
కొసమెరుపు: సహజంగా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అధిష్ఠానాన్ని కలిసేందుకు సీఎంలు, మంత్రులు ఢిల్లీ వెళ్తుంటారు. ఇప్పుడు మాత్రం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు అదికూడా యావత్ మంత్రివర్గం వెళ్లాలని భావించడం అరుదే.