సీఎం రేసులో ఎనిమిది మంది... రేవంత్ సంచలన కామెంట్స్...!
అపుడు కదా కాంగ్రెస్ సంబరాలు చేసుకోవాల్సింది. కానీ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ వస్తుంది అని చాలా నిబ్బరంగా ఉన్నారు
ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమ లింగం అని ఒక ముతక సామెత ఉంది. ఇపుడు దాన్ని చక్కగా తెలంగాణాలోని కాంగ్రెస్ కి అన్వయించుకోవచ్చు అని అంటున్నారు ఎలా అంటే తెలంగాణాలో పోలింగ్ అయితే జరిగింది. రిజల్ట్స్ ఇంకా రాలేదు. అఫ్ కోర్స్ కాంగ్రెస్కి మొగ్గు ఉంటుందని సర్వేలు కానీ పరిస్థితులు కానీ చాటి చెబుతున్నాయి. అయితే పూర్తిగా అధికారికంగా ఫలితాలు వచ్చేది డిసెంబర్ 3వ తేదీన.
అపుడు కదా కాంగ్రెస్ సంబరాలు చేసుకోవాల్సింది. కానీ పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ వస్తుంది అని చాలా నిబ్బరంగా ఉన్నారు. ఆయన పీసీసీ చీఫ్ హోదాలో చాలా చోట్ల తిరిగారు. ఆయనకు కొంతవరకూ కాంగ్రెస్ వేవ్ తెసులు. అందుకే ఆయన ధీమాగా చాలా విషయాలు చెబుతూ వస్తున్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తారు అని చెబుతున్నారు.
అంతే కాదు తొలి క్యాబినెట్ మీటింగ్ కూడా అదే రోజు జరుగుతుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన మీడియాతో చిట్ చాట్ గా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఏకంగా ఎనిమిది మంది ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని ఆయన చెబుతున్నారు.
తాను పీసీసీ చీఫ్ గా ఉన్నానని, తెలంగాణా కాంగ్రెస్ లో ఎంతో మంది సీఎం రేసులో ఉన్నరని ఒక నంబర్ కూడా ఆయన చెప్పారు. ఎనిమిది మంది దాకా నేతలు సీఎం పోస్ట్ కోసం ఉంటారని ఆయన అంటున్నారు. అయితే కాంగ్రెస్ కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్నది మాత్రం కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని ఆయన చెబుతున్నారు.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి చెప్పే వారు వీరేనా అన్న చర్చ కూడా ఉంది. సీఎం రేసులో ఉన్న వారిలో ఉత్తం కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కె జానారెడ్డి, రేణుకా చౌదరి, టి జీవన్ రెడ్డి, దామోదర్ రాజ నరసిం హా భావిస్తున్నారు. ఇక సీఎం రేసులో రేవంత్ రెడ్డి ఎటూ అగ్ర భాగాన ఉంటారని అంటున్నారు.
మొత్తానికి చూస్తే కాంగ్రెస్ గెలిస్తే మాత్రం చాలా మంది సీఎం పోస్ట్ మీద ఆశలు పెంచుకున్నారని అర్ధం అవుతోంది. మరి కాంగ్రెస్ గెలుపు అనంతరం జరిగే పరిణామాలు హై కమాండ్ కి అగ్ని పరీక్షంగా మారుతాయని అంటున్నారు. సీఎం ఎవరు అన్నది నిర్ణయించడం అంటే కష్టమే అవుతుంది అని అంటున్నారు.
అయితే కాంగ్రెస్ కి ముందు పూర్తి మెజారిటీ రావాలి. అపుడు అంతా కూర్చుని ఒక్క మాట మీద అభ్యర్థిని ఎన్నుకోవాలి. కర్నాటకలో కాంగ్రెస్ కి బంపర్ మెజరిటీ వచ్చింది. కానీ సీఎం సీటు దగ్గర పెద్ద పంచాయతీయే నడచింది. మరి తెలంగాణాలో ఎలా సెట్ చేస్తారో చూడాల్సి ఉంది.