తెలంగాణ : అడిట్ లేదని అడ్డగోలుగా.. ఖర్చు చేశారు !
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు చేసిన ఖర్చు ఎంతో తెలుసా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల అధికారులు చేసిన ఖర్చు ఎంతో తెలుసా ? రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల ఎన్నికల నిర్వహణకు గాను దాదాపు రూ.701 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. సమాచార హక్కు చట్టం ప్రకారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించిన వివరాలు బయటపెట్టడంతో ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఒక్కో నియోజకవర్గానికి సగటున ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏకంగా దాదాపు పది కోట్లు కూడా ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఎన్నికల ఖర్చుపై ఆడిట్ ఉండదనే అవకాశాన్ని వినియోగించుకుని కొందరు అధికారులు విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది.
ఎన్నికల్లో ఎక్కడ ? ఎవరు ? ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయం అధికారులు డేగ కళ్లతో పర్యవేక్షిస్తారు. మరి అదే సమయంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చు అందరినీ విస్మయ పరుస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయొచ్చని ఎన్నికల నిబంధనలు చెబుతున్నాయి. అయితే అభ్యర్థుల ఖర్చుకు, వారు సమర్పించే వివరాలకు వందల రెట్ల వ్యత్యాసం ఉంటుంది.
కానీ ఎన్నికల నిర్వహణకు ఈసీ ఖర్చు చేసే నిధులపై లెక్క చెప్పాల్సిన అవసరం లేకపోవడంతో అధికారులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే రూ.701 కోట్లు ఖర్చు చేయడం సర్వత్రా కలకలం రేపుతున్నది.