తెలంగాణ ఎందుకింత 'హాట్'.. రీజన్లివే....!
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తున్నవారికి ఇదే సందేహం వస్తోంది
ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తున్నవారికి ఇదే సందేహం వస్తోంది. తెలంగాణ ఏర్పడి ఇప్పటికి పదేళ్లు అవుతోంది. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చాయి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత.. ఇది మూడో అసెంబ్లీ ఎన్నికలు. అయితే.. 2014, 2018లో జరిగిన ఎన్నికల కంటే కూడా.. ఇప్పుడు ఎందుకు ఇంతగా హాట్ హాట్ వాతావరణం కనిపిస్తోంది? అనేది కీలక విషయం.
కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గుంపులు గుంపులుగా వచ్చేశారు. తెలంగాణపై వాలిపోయారు. నిజానికి.. బీఆర్ ఎస్ పార్టీ కూడా.. ఈ రేంజ్‌లో జాతీయస్థాయి నాయకులు వస్తారని లెక్కలు వేసుకోలేదు. అంతేకాదు.. ఈ రేంజ్‌లో చివరి అంకం ఉంటుందని కూడా అనుకోలేదు. కానీ, అనూహ్యంగా బీజేపీ నుంచి ప్రధాని మోడీ, అమిత్‌షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్, అనురాగ్ ఠాకూర్, గడ్కరీ, పీయూష్ గోయెల్.. ఇలా చెప్పుకొంటూ.. పోతే.. పదుల సంఖ్యలో నాయకులు వచ్చారు.
అదేసమయంలో కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్ సహా అనేక మంది ప్రచారాన్ని దుమ్మురేపుతున్నారు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ సహా ఆయన కుమారుడు, మేనల్లుడు దుమ్మురేపితే.. ఎన్నికల ప్రచారం చివరి అంకంలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌ల ధాటి పెరిగిపోయింది. అయితే.. ఎందుకు ఇంతగా జాతీయ పార్టీలు తెలంగాణ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనేది చర్చగా మారింది.
దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. బీజేపీ విషయాన్ని తీసుకుంటే.. దక్షిణాదిలో కర్ణాటక తప్ప.. ఇతర రాష్ట్రాల్లో బలంగా లేదు. ఇప్పుడిప్పుడే.. తెలంగాణలో పుంజుకుంటోంది. బండి సంజయ్ సారథ్యంలో పుంజుకుంది. ఈ క్రమంలో దీనిని మరింత పీక్‌కు తీసుకువెళ్లడం ద్వారా.. ఏపీ, తమిళనాడుల్లో పార్టీని పుంజుకునేలా చేయొచ్చనేది ఒక వ్యూహం. రెండు.. కేంద్రంపై కాలు రువ్విన కేసీఆర్.. మోడీని గద్దెదింపుదామని.. కొన్నాళ్ల కిందట వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ఆయన సత్తాను తగ్గించేందుకు తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ సాధ్యమైనన్ని సీట్లు గెలుచుకోవాలనే వ్యూహంతో ఉంది. ఇక, కాంగ్రెస్‌కు ఇది.. మరణ సదృశం. తెలంగాణ ఇచ్చామని చెబుతున్నా.. ఇప్పటికి రెండు ఎన్నికల్లోనూ ప్రజలు పట్టం కట్టలేదు. ఈ క్రమంలో ఈ ఎన్నికల్లో అయినా.. గెలిచి తీరాలనేది పార్టీ వ్యూహం. పైగా వచ్చే సార్వత్రిక, ఏపీ ఎన్నికల్లో పుంజుకునేందుకు తెలంగాణ తురుపు ముక్క అవుతుందని భావిస్తోంది. అందుకే.. ఈ రెండు పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.