రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం!
తెలంగాణలో రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంతగా అన్నట్లుగా వేడెక్కుతూ రసవత్తరంగా మారుతున్నాయి
తెలంగాణలో రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంతగా అన్నట్లుగా వేడెక్కుతూ రసవత్తరంగా మారుతున్నాయి. కేసీఆర్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న వేళ... ఆ పుండుపై నిత్యం కారం చల్లేపనిలో రేవంత్ బిజీగా ఉన్నారనే మాటలూ వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం సందర్శనకు కేసీఆర్ ను స్పెషల్ గెస్ట్ గా పిలవాలనుకున్నారు!!
అవును... ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశాలు ఈనెల 13వ తేదీ వరకు జరగాల్సి ఉన్నప్పటికీ... ఒక రోజు ముందే ముగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అనంతరం 13న ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
ఈ సమయంలోనే రేవంత్ సరికొత్తగా ఆలోచించారని.. ఇందులో భాగంగా... ఈ సందర్శనకు బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించాలని ఫిక్సయినట్లు చెబుతున్నారు. పైగా ఈ బృహత్తర బాధ్యతను ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. దీంతో ఈ ప్రత్యేక ఆహ్వానంపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆసక్తిగా మారింది.
మరోపక్క సరిగ్గా అదే రోజున (ఫిబ్రవరి 13) కృష్ణాజలాల అంశంపై నల్గొండ జిల్లాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా నల్గొండలోని మర్రిగూడ బైపాస్ లో సుమారు రెండు లక్షల మందితో భారీ ఎత్తున సభ నిర్వహించాలని ఫిక్సయ్యారు. అయితే... ఇదే రోజు ప్రభుత్వం కాళేశ్వరం సందర్శనకు కేసీఆర్ ను సైతం ప్రత్యేకంగా ఆహ్వానించాలనే నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతుంది.
కాగా... ప్రస్తుతం అధికార కాంగ్రెస్, బీఆరెస్స్ ల మధ్య తెలంగాణలో నీటి యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోన్న సంగతి తెలిసిందే. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కాంగ్రెస్ పార్టీ.. కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంటే.. మరోపక్క కృష్ణాజలాల విషయంలో అధికార పక్షాన్ని ఆటాడుకోవాలని బీఆరెస్స్ ప్రణాళికలు రచిస్తుందని తెలుస్తుంది! ఈ క్రమంలో తాజాగా సీఎం రేవంత్ నిర్ణయం సంచలనంగా మారుతుంది.. దీనిపై కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది మరింత ఆసక్తిగా మారింది.