గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా.. తీరని ఆశ కోసమేనా?

తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై తీరు కూడా అలానే ఉన్నట్లు కనిపిస్తోంది.

Update: 2024-03-18 12:09 GMT

రాజకీయ నేతల తీరు భలే సిత్రంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో కోటి ఆశలతో రాజకీయాల్లో అడుగు పెట్టేటోళ్లు లక్షలుగా ఉన్నా.. వందల మందికి మాత్రమే అవకాశాలు లభిస్తుంటాయి. అత్యుత్తమ పదవుల్ని చేపట్టేందుకు పదుల సంఖ్యలో మాత్రమే కలిసి వస్తుంది. ప్రతిభ ఎంత ఉన్నా కాలం కలిసి రాకుంటే ఎంత పెద్ద నాయకుడైనా సరే.. అత్యుత్తమ పదవులు రావు. అయితే.. అలా పదవుల్నిచేపట్టిన తర్వాత కూడా కెరీర్ ఆరంభంలో వేటి మీద అయితే మోజు ఉంటుందో వాటిని తీర్చుకోవాలన్న ఆశ మాత్రం తీరకుండా ఉండిపోయి.. దాని సంగతి కూడా చూడాలనుకునేలా చేస్తుంది.

తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై తీరు కూడా అలానే ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆమె తన పదవికి రాజీనామా చేసి అందరికి షాకిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవిలో ఉన్న వేళలో గవర్నర్ పదవిని చేపట్టిన ఆమె.. ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోవటమే కాదు సై అంటే సై అనేలా చేశారు. సీఎంకు పోటీగా ఆమె వ్యవహరించిన తీరుతో ఆమెలోని ఫైటర్ ను తెలుగు ప్రజలు చూశారు. గవర్నర్ పదవిలో ఉన్న ఆమె విషయంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అనుసరించిన తీరుకు.. ఆమె సరైన కౌంటర్ ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది.

తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసిన అనుభవం ఉన్న ఆమె ఎంపీగా ఎన్నిక కావటం కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలాంటి వేళలో ఆమెను తెలంగాణకు గవర్నర్ గా నియమించటం ద్వారా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం సరైనదేనన్న అభిప్రాయం వ్యక్తమయ్యేలా ఆమె వ్యవహరించారు. గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆమె అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. గడిచిన కొద్దిరోజులుగా దక్షిణాది మీద ఫోకస్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లోని రాజ్ భవన్ లోనే బస చేశారు. ఆయన తెలంగాణ పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేయటం ఆసక్తికరంగా మారింది.

ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పంతం తమిళి సైలో ఎక్కువ. గవర్నర్ హోదాలో ఆమె ఇన్నేళ్లు పని చేసిన తర్వాత కూడా చట్టసభకు నేరుగా ఎన్నిక కావాలన్న తన చిరకాల కోరికను తీర్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ నుంచి ఆమెకు సానుకూల సంకేతం రావటంతో ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. గవర్నర్ గా పని చేస్తూ.. తన మార్కును వేసిన ఆమె ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం అంత బాగుండదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి.. ఒక స్థాయిలో ఉన్న తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగకపోవటం సబబుగా ఉంటుంది. ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లు ఆమె ఎంపీగా పోటీ చేయటం కోసమే రాజీనామా చేశారా? లేదంటే ఇంకేమైనా బలమైన కారణం ఉందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News