తెలంగాణ పీసీసీ పీఠం ఎవరికి?
ఇక, ఇప్పటికే కొందరి పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. గత నెలలో ఒకరి పేరు ఫైనల్ అయిందన్న ప్రచారం కూడా జరిగింది.
తెలంగాణ పీసీసీ చీఫ్ పీఠాన్ని ఎవరికి అప్పగించాలి? ఎవరికి ఇవ్వాలి? ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతోంది. దీనికి కారణం.. పార్టీ అధిష్టానం ఒకటి ఆలోచిస్తుంటే.. క్షేత్రస్థాయి నాయకులు మరో విధంగా ఆలోచన చేస్తున్నారు. ఈ పరిణామాలతో తెలంగాణ పీసీసీ చీఫ్ వ్యవహారం.. ముడిపడడం లేదు. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారు. నిజానికి ఆయన పదవీ కాలం కూడా పూర్తయింది. దీంతో చీఫ్‌ను నియమించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
కానీ, అధిష్టానం మాత్రం మీన మేషాలు లెక్కిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క పొన్నాల లక్ష్మయ్య తప్ప.. పీసీసీ చీఫ్‌లుగా చేసిన వారంతా విభజిత తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే. దీంతో ఈ సారి బీసీలు, లేదా తమకు దూరం అవుతున్నారని భావిస్తున్న ఎస్సీ ఓటు బ్యాంకును తిరిగి సొంతం చేసుకునేందుకు లేదా నిలబెట్టుకునేందుకు ఆ వర్గానికి కీలక పోస్టు ఇవ్వాలా? అనే విషయంపై పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.
ఇక, ఇప్పటికే కొందరి పేర్లతో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. గత నెలలో ఒకరి పేరు ఫైనల్ అయిందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ చివరికి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇదిలావుంటే.. రేవంత్ ఇచ్చిన పేర్లతో సంబంధం లేకుండా కొందరు సీనియర్లు ఢిల్లీలో మంత్రాంగాలు నెరుపుతున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ముగ్గురు కీలక నాయకులు ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గేను సంప్రదించినట్టు సమాచారం.
తాజాగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఈ పదవిని ఎస్సీలకు ఇవ్వడం ద్వారా మేలు పొందాలని.. సుప్రీం తీర్పు తర్వాత.. కీలక పదవిని ఆ వర్గానికే ఇచ్చామన్న క్రెడిట్‌ను జాతీయస్థాయిలో సొంతం చేసుకునేందుకు పార్టీ మొగ్గు చూపుతోంది. మరోవైపు.. బీసీలకు ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే.. తాము మాత్రం తక్కువా? అంటూ ఎస్టీ నాయకులు సైతం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎలా చూసుకున్నా.. మరికొన్నాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో ఇప్పుడు పీసీసీ పీఠాన్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధిష్టానం లెక్కలు వేసుకుంటున్నా.. అడుగులు మాత్రం ముందుకు పడడం లేదు.
సై అంటున్న నేతలు వీరే..
+ మహేష్‌కుమార్‌గౌడ్
+ మధుయాష్కీ గౌడ్
+ సంపత్ కుమార్
+ బలరాం నాయక్
+ జగ్గారెడ్డి