కేసీయార్ కు మాస్టర్ ప్లాన్ గండం ?

అప్పట్లో ప్రభుత్వం రెడీచేసిన మాస్టర్ ప్లాన్ ను రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఆందోళనలు కూడా జరిగాయి

Update: 2023-10-25 17:30 GMT

రాబోయే ఎన్నికల్లో కేసీయార్ కు మాస్టర్ ప్లాన్ గండం తప్పేట్లు లేదు. వచ్చేఎన్నికల్లో గజ్వేలుతో పాటు కామారెడ్డిలో కూడా పోటీచేయాలని కేసీయార్ డిసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కామారెడ్డిలో కూడా పోటీచేయాలన్న కేసీయార్ నిర్ణయమే ఇపుడు వివాదాస్పదమవుతోంది. ఎలాగంటే కామారెడ్డిలో రైతులంతా ముఖ్యమంత్రిపై తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు. ఆమధ్య కామారెడ్డి నియోజకవర్గం పరిధిలోని రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించటంలో భాగంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీచేసింది.

అప్పట్లో ప్రభుత్వం రెడీచేసిన మాస్టర్ ప్లాన్ ను రైతులంతా మూకుమ్మడిగా వ్యతిరేకించారు. రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఆందోళనలు కూడా జరిగాయి. రైతులు ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇపుడు ఎన్నికల రూపంలో అవకాశం వచ్చింది కదాని రైతులంతా మళ్ళీ ఏకమయ్యారు. గతంలో తయారుచేసిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను గనుక ప్రభుత్వం వెంటనే రద్దుచేయకపోతే రాబోయే ఎన్నికల్లో తాము 100 నామినేషన్లు వేస్తామని రైతులు వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. ఒకపుడు రైతులు ఇలాగే వార్నింగులు ఇచ్చి 100 మంది నామినేషన్లు వేయటం వల్లే నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఓడిపోయారు.

నియోజకవర్గంలోని రైతులంతా కలిసి రైతు ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పాటయ్యారు. దీని ఆధ్వర్యంలోనే రాబోయే ఎన్నికల్లో నామినేషన్లు వేయబోతున్నట్లు రైతు నేతలు ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ పరిధిలోనుండి తమ భూములను కాపాడుకునేందుకు తాము ఏ స్ధాయి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నట్లు రైతు నాయకులు చెప్పారు.

తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇండస్ట్రియల్ జోన్ పేరుతో వ్యవసాయ భూములను కామారెడ్డి మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించటాన్ని చాలా కాలంగా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దుచేయకపోతే రాబోయే ఎన్నికల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరించారు. మొత్తంమీద ఒకవైపు రైతులు, మరోవైపు గల్ఫ్ బాధితుల కుటుంబాలు, ఇంకోవైపు గిరిజనులు, చివరగా ప్రభుత్వంపై మండిపోతున్న జనాల దెబ్బకు బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇలాంటి వన్నీ కేసీయార్ గెలుపుపై ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News