కేసీఆర్‌కు గొప్ప ఛాన్స్ ఇచ్చాం: రేవంత్‌రెడ్డి

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు.. త‌మ ప్ర‌భుత్వం గొప్ప ఛాన్స్ ఇచ్చింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

Update: 2024-06-28 01:30 GMT

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు.. త‌మ ప్ర‌భుత్వం గొప్ప ఛాన్స్ ఇచ్చింద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల విష‌యంలో ఆయ‌న త‌న నిజాయితీని నిరూపించు కునే అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. విద్యుత్ విష‌యంలో క‌మిష‌న్ వేయ‌డానికి బీఆర్ఎస్ నాయ‌కులే కార‌ణమ‌ని.. వారు కోరితేనే క‌మిష‌న్ వేశామ‌ని చెప్పారు. కొన్నాళ్లుగా తెలంగాణ‌లో విద్యుత్ క‌మిష‌న్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా ర‌చ్చ రేపుతున్న విష‌యం తెలిసిందే.

క‌మిష‌న్ చైర్మ‌న్‌గా ఉన్న రిటైర్డ్ న్యాయ‌మూర్తి.. హ‌ద్దులు మీరుతున్నార‌ని, అస‌లు క‌మిష‌న్‌ను ర‌ద్దు చేయా ల‌ని కోరుతూ.. మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిపై తాజాగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. క‌మిష‌న్ వేయాల‌న్న‌ది త‌మ ఉద్దేశం కాద‌ని.. అసెంబ్లీలో మాజీ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి క‌మిష‌న్ వేసి విచార‌ణ చేయాల‌ని సూచించిన త‌ర్వాతే తాము క‌మిష‌న్‌ను వేసిన‌ట్టు చెప్పారు. సిట్టింగ్ జ‌డ్జితో క‌మిష‌న్ వేద్దామ‌ని అంటే.. కాద‌ని అన్నార‌ని.. దీంతో రిటైర్డ్ జ‌డ్జికి బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌న్నారు.

Read more!

తొలినాళ్లలో క‌మిష‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌ని బీఆర్ఎస్ నాయ‌కులు.. త‌ర్వాత కాలంలో కేసీఆర్ స్వ‌యంగా వ‌చ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చైర్మ‌న్ ఆదేశించ‌డంతో ర‌గిలిపోతున్నార‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. అందుకే కోర్టుల‌కు వెళ్లార‌ని చెప్పారు. కానీ, ఇది కేసీఆర్ నిజాయితీని నిరూపించుకునేందుకు గొప్ప అవ‌కాశంగా రేవంత్ చెప్పారు. త‌న వాద‌నా ప‌టిమ ద్వారా.. త‌న‌ను తాను నిరూపించుకోవ‌చ్చు క‌దా! అని ప్ర‌శ్నించారు. అస‌ర‌మైతే.. మీడియా ద్వారా.. లైవ్‌లో విచార‌ణ‌ను ప్ర‌సారం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

యాదాద్రి, భ‌ద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుల‌లో అవినీతి జ‌రిగ‌క‌పోతే.. భ‌యం ఎందుక‌ని రేవంత్ ప్ర‌శ్నించారు. క‌మిష‌న్ వేసిన మూడు నెల‌ల వ‌ర‌కు అంతాబాగానే ఉన్న‌ప్ప‌టికీ.. కేసీఆర్‌ను ప్ర‌శ్నిస్తామంటే.. మాత్రం కమిష‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. విచార‌ణ క‌మిష‌న్ వేయ‌డం త‌ప్పా.. కేసీఆర్‌ను పిల‌వ‌డం త‌ప్పా.. క‌మిష‌న్ చైర్మ‌న్‌గా జ‌స్టిస్ న‌ర‌సింహారెడ్డిని నియ‌మించ‌డం త‌ప్పా... అని నిల‌దీశారు. బీఆర్ఎస్ నేత‌లు ఏం మాట్లాడుతున్నారోవారికైనా తెలుస్తోందా? అని అన్నారు. ``ఒక‌రు శ్రీరామ‌చంద్రుడు, మ‌రొక‌రు స‌త్య హ‌రిశ్చంద్రుడుగా నిరూపించుకునే అవ‌కాశం వ‌చ్చింది`` అని రేవంత్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News