వారి ఓటు వారికే వేసుకోలేరు.. హైదరాబాద్ లో ఐదుగురు అభ్యర్థుల వింత పరిస్థితి
అయితే, తెలంగాణలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐదుగురు అభ్యర్థులు మాత్రం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమో ఓటు అంతకంటే ముఖ్యం. ఈ హక్కును వినియోగించుకోవడానికి ఎన్నో సంస్థలు చైతన్యం కల్పిస్తుంటాయి. ప్రభుత్వ వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుని ఎన్నికల సంఘమూ అత్యంత పటిష్ఠమైన ఏర్పాట్లతో ఓట్ల పండగను నిర్వహిస్తుంటుంది. ఇక పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఒక్క ఓటు కూడా చేజారకుండా చూసుకుంటారు. అయితే, తెలంగాణలో ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఐదుగురు అభ్యర్థులు మాత్రం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అసదుద్దీన్ ఓటు ఇతర పార్టీ అభ్యర్థికే..
ఓటు ఒకచోట.. పోటీ మరోచోట.. ఇదీ హైదరాబాద్ మహా నగర పరిధిలోని ఐదుగురు అభ్యర్థుల పరిస్థితి. వాస్తవానికి ఎక్కడ ఓటు ఉంటే అక్కడే బరిలో దిగాలని ఏమీ లేదు. కాగా, అసలు విషయానికి వస్తే హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఓటు వారి కార్యక్షేతం పాత బస్తీలో లేదు. అసద్ భాయ్ రాజేంద్ర నగర్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇది చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. చిత్రమేమంటే.. చేవెళ్లలో ఎంఐఎం అభ్యర్థిని నిలపలేదు. అంటే.. అసదుద్దీన్ ఓటు కచ్చితంగా వినియోగించుకుంటే అది వేరే పార్టీ అభ్యర్థికేనని స్పష్టమవుతోంది.
మాధవీ లత ఓటు కంటోన్మెంట్ లో హైదరాబాద్ లో అసదుద్దీన్ ఢీ కొడుతున్న బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్ లో ఉంటున్నారు. ఇది కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇక ఎంపీ నియోజకవర్గం మాత్రం మల్కాజిగిరి. అంటే.. మాధవీ లత అసెంబ్లీ ఉప ఎన్నికలో కంటోన్మెంట్ కు, లోక్ సభ ఎన్నికలో మల్కాజిగిరి అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది.
హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ కు ఓటు జూబ్లీహిల్స్ లో ఉంది. ఇది సికింద్రాబాద్ లోక్ సభ స్థానం పరిధికి వస్తుంది. దీంతో సమీర్ తన ఓటును తనకు వేసుకోలేరు.
చేవెళ్లలో ఓటు మల్కాజిగిరిలో పోటీ మల్కాజిగిరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఓటు తాండూరు అసెంబ్లీ పరిధిలో ఉంది. ఇది చేవెళ్ల లోక్ సభ నియోజకర్గం కిందకు వస్తుంది. అంటే.. సునీతా మరో అభ్యర్థికి ఓటు వేయాల్సిందే.
మల్కాజిగిరిలో ఓటు.. చేవెళ్లలో పోటీ చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు ఓటు వచ్చేసి మల్కాజిగిరి లోక్ సభ స్థానంలో ఉంది. ఇది కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోకి వస్తుంది. దీంతో కాసానికి వేరొక అభ్యర్థికి ఓటు వేయాలి.