ఈ సమస్యలు ఎటు పోయాయ్ గురూ.. తెలంగాణ మాట..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం జోరుగా ఉంది. ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోలాహలం జోరుగా ఉంది. ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. మాటల తూటాలు, విమర్శల పర్వాలతో నాయకులు తీరిక లేకుం డా ఉన్నారు. ఇక, అధికార పక్షం.. బీఆర్ ఎస్ తాము అమలు చేస్తున్న ధరణి, రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి వంటి కీలక పథకాలను ప్రచారం చేస్తోంది. ఇదేసమయంలో ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ లు వీటినే విమర్శిస్తున్నాయి.
ఈ మధ్యలో రైతులకు ఉచిత విద్యుత్ అంశం కూడా ప్రధాన చర్చకు వస్తోంది. దీనిపైనా బీఆర్ ఎస్ -కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర రాజకీయ తుఫాను చోటు చేసుకుంది. అయితే.. ఈ క్రమంలో అసలు కీలకమైన సమస్యలను, నిన్న మొన్నటి వరకు ప్రజల మధ్య ప్రస్తావించిన సమస్యలను కూడా.. అన్ని పార్టీలు మరిచిపోయాయనే వాదన ఉంది. కానీ, తెలంగాణ సమాజం మాత్రం వీటిని గుర్తుంచుకోవడం గమనార్హం.
తాజాగా ఆన్ లైన్ ఛానళ్లు చేస్తున్న సర్వేల్లో ప్రజలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టారు. వాటి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వీటిలో ప్రధానంగా చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ మునిగిపోతుండడంపై భాగ్యనగర వాసులు ప్రశ్నిస్తున్నారు. దీనిని ఎన్నికల సమయంలో ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం. అదేవిధంగా ధాన్యం కొనుగోళ్ల అంశం ఒక దశలో రాష్ట్రాన్ని కుదిపేసింది. ఏకంగా ముఖ్యమం త్రి నిరసన వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడు ఈ అంశం కూడా చర్చకు రావడం లేదు.
అదేవిధంగా గ్రూప్ పరీక్షల్లో అవినీతి గురించి బీజేపీ , కాంగ్రెస్‌లు పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేశాయి. ఇక, ఇప్పుడు ఆ ఊసే లేదు. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో తీవ్రంగా ఉందని చెప్పిన కాంగ్రెస్.. కీలకమైన ఎన్నికల సమయంలో నిరుద్యోగంపై ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అదేసమయంలో విభజన చట్టం ప్రకారం రావాల్సిన ఫ్యాక్టరీలు, నీటి వాటాలపై ఎన్నికలకు ముందు వరకు.. బీజేపీపై పోరు చేసిన అధికార పార్టీ ఎన్నికల సమయంలో మాత్రం వాటిని పక్కన పెట్టింది.
దీనిని బట్టి ఇవి.. అంత ప్రాధాన్యం లేనివని ఆయా పార్టీలు భావిస్తున్నాయా? లేక.. ప్రజలు మరిచిపోయారని అనుకుంటున్నారా? అనేది చర్చనీయాంశంగా మారింది. కానీ, ప్రజలు మాత్రం ఆయా సమస్యలపై క్షేత్రస్థాయిలో చాలానే ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.