కేసీయార్ నుంచి పైసా వసూల్...!

ఆర్కే సింగ్ మాట్లాడుతూ, విభజన జరిగిన కొత్తల్లో విద్యుత్ కొరతతో ఉన్న తెలంగాణాకు ఏపీ నుంచి విద్యుత్ తీసుకునేలా చూశామని అన్నారు.

Update: 2023-08-02 00:30 GMT

కేసీయార్ ఏపీని ఆదుకుంటామని అంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకూడదు అంటారు. టీయారెస్ ని బీయారెస్ గా విస్తరించి ఏపీలోనూ పోటీ చేస్తామని చెబుతారు. కానీ ఏపీకి విభజన తరువాత విద్యుత్ సంస్థల నుంచి తీసుకున్న విద్యుత్ కి గానూ చెల్లించాల్సిన 6,000 కోట్ల రూపాయల సొమ్ముని మాత్రం ఈ రోజుకీ చెల్లించలేదు అని విద్యుత్ శాఖ అధికారులు గగ్గోలు పెడతారు. ఈ మధ్యలో ఏపీలో రెండు ప్రభుత్వాలు మారాయి.

కానీ పొరుగున ఉన్న తెలంగాణా నుంచి రావాల్సిన ఆ మొత్తాన్ని వెనక్కి రప్పించలేకపోతున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం వసూల్ చేయాల్సిందే అంటోంది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వి విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు.

ఏపీ విద్యుత్ ని తెలంగాణాకు అప్పట్లో ఇవ్వడం అంటే కేంద్రం సూచనలతోనే అని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో గత తొమ్మిదేళ్ళుగా తెలంగాణా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని, కేంద్రం ఏమి చేస్తోంది అని నిలదీశారు. తెలంగాణాకు కేంద్రం చెల్లించే రాష్ట్ర పన్నుల వాటా ఆదాయం నుంచి ఈ 6,000 కోట్ల రూపాయలను మినహాయించి ఇవ్వాలని కూడా కోరారు.

దీనికి సంబంధించి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ, విభజన జరిగిన కొత్తల్లో విద్యుత్ కొరతతో ఉన్న తెలంగాణాకు ఏపీ నుంచి విద్యుత్ తీసుకునేలా చూశామని అన్నారు. అయితే ఆ బకాయిలు చెల్లించాల్సి ఉందని అన్నారు. మొదట్లో కొంత చెల్లించిన తెలంగాణా ప్రభుత్వం ఆ తరువాత బకాయి పెట్టడంతో అవి కాస్తా ఆరు వేల కోట్లకు పైగా పెరిగిపోయాయని అన్నారు. కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం తెలంగాణాకు విద్యుత్ సరఫరా చేసిందని, అందువల్ల బకాయిలు ఏపీకి చెల్లించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ అంగీకరించారు.

ఒక రాష్ట్రం తోటి రాష్ట్రానికి చెల్లించకుండా వదిలేసిన బకాయిలను ఎలా వసూల్ చేయాలన్న దాని మీద న్యాయపరంగా కూడా చర్చిస్తున్నామని అన్నారు. అదే విధంగ రాష్ట్ర పన్నులలో వాటా కింద తెలంగాణకు ఇచ్చే నిధుల నుంచి ఈ బకాయిల మొత్తాన్ని మినహాయించాల్సిందిగా ఆర్బీఐని కోరే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఆర్‌కె సింగ్‌ తెలిపారు.

దీనిని బట్టి చూసినపుడు కేంద్రం కేసీయార్ నుంచి కచ్చితంగా ఏపీకి బకాయి మొత్తాన్ని ఇప్పించే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అలా కనుక వస్తే ఏపీకి భారీగా ఆర్థిక ఊరట లభిస్తుంది అంటున్నారు. అదే విధంగా షెడ్యూల్ 9, 10 లలో ఉన్న ఆస్తుల విభజన కూడా పూర్తి చేస్తే కనుక ఏపీకి లక్ష నుంచి లక్షన్నర కోట్ల రూపాయల దాకా లభిస్తుంది అని అంటున్నారు. మరి కేంద్రం ఏపీకి న్యాయం చేసేలా అడుగులు ముందుకు వేస్తుందని ఆశిస్తున్నారు

Tags:    

Similar News