ముఖాముఖీ పోరు : లాభం కాంగ్రెస్ కా... బీయారెస్ కా...?
మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 80 సీట్ల దాకా ముఖ్యా ముఖీ పోరుకు మార్గం సుగమం అయింది. అలాగే మిగిలిన 29 సీట్లలో త్రిముఖ పోరు సాగనుంది అని తెలుస్తోంది.
బహు ముఖ పోరు కాస్తా త్రిముఖ పోరుగా ఉంటుంది అనుకున్నా అది కాస్తా నామినేషన్ల ఉప సంహరణ తరువాత అత్యధిక స్థానాలలో ముఖా ముఖీ పోరుగా మారిపోయింది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 80 సీట్ల దాకా ముఖ్యా ముఖీ పోరుకు మార్గం సుగమం అయింది. అలాగే మిగిలిన 29 సీట్లలో త్రిముఖ పోరు సాగనుంది అని తెలుస్తోంది.
నిజానికి చూస్తే ఈసారి ఎన్నికల్లో ఉత్సాహం మీద చాలా మంది ఇండిపెండెంట్లు బరిలోకి దిగారు. అలాగే వివిధ పార్టీల టికెట్లు ఆశించి రాక భంగపడి ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. అలా బీయారెస్ కాంగ్రెస్ బీజేపీ నుంచి రెబెల్స్ నామినేషన్లు వెల్లువెత్తాయి. కానీ నామినేషన్ల ఉప సంహరణ ముందు అన్ని పార్టీలు బుజ్జగింపులకు తెర తీశాయి.
చాలా మంది రెబెల్స్ ని నయాన దారికి తెచ్చాయి. ఈ విషయంలో అత్యధిక శాతం సక్సెస్ అయింది కాంగ్రెస్ అని చెప్పాలి. అధికారంలోకి కాంగ్రెస్ వస్తే నామినేటెడ్ పదవులు ఇస్తామని నచ్చచెప్పారు. అదే విధంగా అనేక ఇతర అవకాశాలు ఇస్తామని నచ్చచెప్పారు. ఇప్పటిదాకా అభ్యర్ధులు చేసిన ఖర్చులను కూడా భరించి వాటిని తిరిగి చెల్లించేందుకు కూడా పార్టీ పెద్దలు అంగీకరించారని టాక్.
మొత్తానికి తిరుగుబాటు చేసిన జెండాలు అన్నీ కలసి వాటిని దించేయడం మాత్రం చాలా విజయవంతమైన చర్యగానే భావిస్తున్నారు. కాంగ్రెస్ గాలి వీచడం వల్ల కూడా రెబెల్స్ వెనక్కి తగ్గారని అంటున్నారు. అలాగే బీయారెస్ విషయానికి వస్తే సిట్టింగులకే తొంబై అయిదు శాతం సీట్లు ఇచ్చింది. దాంతో ఆ పార్టీ నుంచి కొంతమంది బయటకు వెళ్లిపోయారు. తక్కువ మంది మాత్రమే రెబెల్స్ గా మారి నామినేషన్లు వేశారు. వారిని బీయారెస్ అగ్ర నాయకత్వం జాగ్రత్తగా దారికి తెచ్చేసింది.
బీజేపీ నుంచి కొంతమంది రెబెల్స్ కి దిగినా పార్టీ బుజ్జగింపులు బయట ఒక క్లారిటీతో కనిపిస్తున్న పొలిటికల్ పిక్చర్ చూసిన తరువాత రెబెల్స్ ఎందుకొచ్చిన పోటీ అని ఆగారని అంటున్నారు. ఏది ఏమైతేనేమి ప్రధాన పార్టీల నుంచి దాదాపుగా రెబెల్స్ అయితే వెనక్కి పూర్తిగా తగ్గిపోయారు. ఇక ఇండిపెండెంట్లు అన్న వారూ ఎపుడూ ఉంటారు. వారు పోటీ చేసినా ప్రభావం అయితే పెద్దగా ఉండదనే అంటున్నారు. తెలంగాణాలో చూస్తే 2014, 2018 ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్లు ఎవరూ గెలిచిన దాఖలాలు లేవు.
ఈ క్రమంలో పోటీ ప్రధాన పార్టీల మధ్యనే కేంద్రీకృతం అయింది. గ్రేటర్ హైదరాబాద్ నిజమాబాద్ లో కొంత పార్ట్, కరీంనగర్, అదిలాబాద్ వంటి చోట్ల బీజేపీకి కొంత ప్రభావం ఉంది. అలాంటి చోట్లతో కలుపుకుంటే దాదాపుగా ముప్పయి చోట్ల త్రిముఖ పోటీ జరుగుతుంది అని అంచనా కడుతున్నారు. మిగిలిన ఎనభై సీట్లలో కాంగ్రెస్ బీయారెస్ ల మధ్యనే భీకరమైన పోరు సాగుతుంది అని అంటున్నారు.
మరి ఈ పోరు వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి ముఖా ముఖీ పోరు ఎపుడూ అధికార పార్టీకే ఇబ్బంది అని అంటారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు గుత్తమొత్తంగా రెండవ పక్షానికి వచ్చి చేరుతుంది. అది చీలిపోదు. అలా చూస్తే ఎనభై సీట్లలో పోటీ ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ కి కొంత అనుకూలం అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.