నారా వారి పల్లెలో నంద‌మూరి-నారా కుటుంబాల సంద‌డి!

ఎంత బిజీగా ఉన్నా.. ఎన్ని షెడ్యూళ్లు ఉన్నా.. ఈ కార్య‌క్ర‌మానికి అంద‌రూ హాజ‌రు కావాల్సిందే.

Update: 2024-01-15 12:41 GMT

సంక్రాంతి అంటేనే కుటుంబాల మ‌ధ్య సంద‌డి. ఇరుగు పొరుగు వారితో క‌లివిడిగా ఉండే పండుగ‌. చుట్టాలు ప‌క్కాలు.. మ‌ర‌ద‌ళ్లు-బావ‌ల స‌ర‌సాలు.. పెద్ద‌ల దీవెన‌లు.. చిన్న‌ల కేరింత‌లు వెర‌సి.. తెలుగు వారి ముచ్చ‌టైన పండుగ సంక్రాంతి శోభే వేరు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు.. ఏటా సంక్రాంతి పండుగ‌ను.. త‌మ సొంత గ్రామం .. చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని నారా వారి ప‌ల్లెలో నిర్వ‌హించుకుంటున్న విష‌యం తెలిసిందే.

ఈ పండుగ‌కు.. నారా-నంద‌మూరి కుటుంబాలు రెండూ కూడా.. ఒకే చోట‌కు చేరుతాయి. ఎంత బిజీగా ఉన్నా.. ఎన్ని షెడ్యూళ్లు ఉన్నా.. ఈ కార్య‌క్ర‌మానికి అంద‌రూ హాజ‌రు కావాల్సిందే. ఇదే ఈ ఏడాది కూడా జ‌రిగింది. పైగాఇది ఎన్నిక‌ల‌కు ముందు వ‌చ్చిన సంక్రాంతి కావ‌డం గ‌మ‌నార్హం. నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబం రాకతో సందడి వాతావరణం ఏర్ప‌డింది.

సంప్ర‌దాయానికి పెద్ద పీట వేస్తూ.. నారావారిపల్లె గ్రామదేవత దొడ్డి గంగమ్మకు నారా, నందమూరి కుటుంబ స‌భ్యులు ప్రత్యేక పూజలు చేశారు. కులదైవం నాగాల‌మ్మ‌కు చంద్రబాబు కుటుంబం పూజలు చేసి పొంగ‌లి నైవేద్యాలను స‌మ‌ర్పించారు. అదేవిధంగా సంక్రాంతి అంటేనే పెద్ద‌ల పండుగ కావ‌డంతో చంద్ర‌బాబు తల్లిదండ్రులు నారా ఖర్జూర నాయుడు, అమ్మణ్ణమ్మ సమాధులకు చంద్రబాబు, భువనేశ్వరి దంప‌తులు నివాళులర్పించారు.

కాగా, నారా వారి పల్లెలో జ‌రిగిన సంక్రాంతి సంబ‌రాల‌కు నంద‌మూరి కుటుంబం నుంచి బాల‌య్య , ఆయ‌న సోద‌రులు, కుటుంబాల‌తో స‌హా హాజ‌ర‌య్యారు. ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ప‌నిలో ప‌నిగ చంద్ర‌బాబు స్థానిక నాయ‌కుల‌తోనూ చిట్ చాట్ చేశారు. మొత్తంగా.. నారా వారి ప‌ల్లెలో నంద‌మూరి, నారా కుటుంబాల సంద‌డి అంబ‌రాన్నంటింది.

Tags:    

Similar News