టీడీపీలో ఇద్దరు మాజీల పవర్ పని చేయడంలేదా...!?

వారిలో వారికి పడకపోయినా ఇద్దరినీ చేరో వైపు పెట్టుకుని పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నారు.

Update: 2024-01-31 03:54 GMT

తెలుగుదేశం పార్టీలో ఆ ఇద్దరు మాజీ మంత్రుల పవర్ పని చేయడం లేదా అన్నది చర్చకు వస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ ఇద్దరు మాజీలూ చాలా సీనియర్లు పార్టీలో హవా చలాయిస్తూ దశాబ్దాలుగా రాజకీయం నడుపుతున్న వారు. ఆ ఇద్దరే గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈ ఇద్దరినీ చంద్రబాబు గత రెండున్నర దశాబ్దాలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.

ఇద్దరినీ న్యాయం చేస్తూ వస్తున్నారు. వారిలో వారికి పడకపోయినా ఇద్దరినీ చేరో వైపు పెట్టుకుని పార్టీని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. అయితే గత పదేళ్లుగా ఈ మాజీలు ఇద్దరూ వ్యవహరించిన తీరుతోనే అధినేత ఇపుడు ఆలోచనలో పడ్డారు అని అంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ పార్టీ అధికారంలో ఉన్న వేళ ఇద్దరికీ మంత్రి పదవులు బాబు ఇచ్చారు. ఇద్దరినీ అయిదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగిస్తూ కీలక శాఖలు కట్టబెట్టారు.

అయితే ఈ ఇద్దరి మధ్య వర్గ పోరుతో విశాఖ జిల్లాలో పార్టీ తీవ్రంగా నష్టపోయింది అని అంటున్నారు. ఇద్దరు మధ్య విభేదాల వల్ల క్యాడర్ కూడా రెండు గా చీలిందని అంటున్నారు. ఎన్ని సార్లు నచ్చచెప్పినా ఇదే తీరు కొనసాగించడం పట్ల చాలా సార్లు అధినేత బాబు మనస్తాపానికి గురి అయిన సందర్భాలు ఉన్నాయి.

ఇక 2019 నుంచి 2024 ల మధ్యలో కూడా ఈ ఇద్దరూ విపక్షంలో ఉన్న పార్టీని కలసై లేపేందుకు ప్రయత్నాలు చేయలేదు. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. విభేదాలు ఈ ఇద్దరు మధ్యన అలాగే ఉన్నాయి. అధికారంలో ఉన్నా లేకపోయినా తమ విధానం ఇదేనని చెప్పకనే చెప్పారని అంటున్నారు. దాంతో విసిగిపోయిన అధినాయకత్వం ఎన్నికల వేళ చూసి మరీ ఇద్దరికీ షాక్ ఇస్తోందని అంటున్నారు.

గంటాకు విశాఖ జిల్లాలో టికెట్ ఇవ్వరని ప్రచారం సాగుతోంది. ఆయన పోటీ చేయాలనుకుంటే వేరే జిల్లాల నుంచి ఎంపీ సీటు ఇస్తారని వద్దు అనుకుంటే పార్టీకి పనిచేయమని చెబుతారని ప్రభుత్వం వచ్చాక చూసుకోవచ్చు అని చెబుతారని అంటున్నారు అలాగే అయ్యన్న విషయం కూడా సీరియస్ గానే అధినాయకత్వం ఉందని అంటున్నారు. ఆయన కూడా తమ కుటుంబానికి రెండు సీట్లు అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

గతంలో అయితే చంద్రబాబు మెత్తబడేవారేమో కానీ ఈసారి బాబులో భారీ మార్పు కనిపిస్తోంది. అందుకే నర్శీపట్నం సీటు ఒక్కటే అని ఖరాఖండీగా చెబుతున్నారని ప్రచారం సాగుతోంది. దాంతో అయ్యన్న కానీ ఆయన కొడుకు కానీ అదే సీటు నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. మొత్తానికి చూస్తే మాజీలు ఇద్దరికీ చంద్రబాబు సరైన సమయంలోనే తనదైన మార్క్ చూపించారా అన్న చర్చ వస్తోంది.


Tags:    

Similar News