టికెట్ ఇచ్చి అభ్యర్థిని మార్చిన వేళ బీజేపీ అభ్యర్థి సూసైడ్ అటెంప్టు

నామినేషన్ ఘట్టం చివరి రోజున తుది జాబితాను విడుదల చేయటం ఒక ఎత్తు అయితే.. ఆఖరి నిమిషంలో చోటు చేసుకున్న మార్పులు అనూహ్య పరిణామాలకు దారి తీశాయి.

Update: 2023-11-11 04:52 GMT

గతానికి భిన్నంగా తెలంగాణ బీజేపీలో టికెట్ కేటాయింపు వ్యవహారం తలనొప్పిగా మారటంతో పాటు.. తీవ్రమైన టెన్షన్ కు దారి తీసింది. నామినేషన్ ఘట్టం చివరి రోజున తుది జాబితాను విడుదల చేయటం ఒక ఎత్తు అయితే.. ఆఖరి నిమిషంలో చోటు చేసుకున్న మార్పులు అనూహ్య పరిణామాలకు దారి తీశాయి. సంగారెడ్డి బీజేపీ అభ్యర్థి విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుకు నిరసనగా బీజేపీ అభ్యర్థి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేయటం సంచలనమైంది.

తెలంగాణ బీజేపీలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించటం.. చివర్లో వారిని మార్చి.. వేరే వారికి ఇవ్వటం లాంటి ఉదంతాలతో తీవ్రమైన గందరగోళం చోటు చేసుకుంది. బీజేపీ తుది జాబితాలో ఇప్పటికే ప్రకటించిన ఇద్దరు బీజేపీ అభ్యర్థుల్ని మారుస్తూ వేరే వారికి టికెట్లు కేటాయించినట్లుగా ప్రకటన జారీ చేశారు. ఇలాంటి పని చేసే ముందు.. ముందుగా అభ్యర్థుల్ని డిసైడ్ చేసిన వారిని బుజ్జగించి.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల మీద నచ్చజెప్పటం లాంటివైనా చేయాలి. కానీ.. అదేమీ లేకుండా చివరి నిమిషంలో కొత్తవారికి టికెట్ ఇవ్వటాన్ని తప్పు పడుతున్నారు.

సంగారెడ్డి బీజేపీ అభ్యర్థిగా దేశ్ పాండే పేరును ప్రకటించారు. దీంతో.. ఆయన నామినేషన్ వేసేందుకు వెళుతుండగా.. అదే స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పులిమామిడి రాజుకు బీఫారమ్ ఇచ్చింది. దీంతో.. షాక్ కు గురైన దేశ్ పాండే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని అక్కడున్న కార్యకర్తలు అడ్డుకున్నారు. తీవ్రమైన దు:ఖంతో కిషన్ రెడ్డికి ఫోన్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేశారు దేశ్ పాండే.

మరో ఉదంతంలో బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థిగా శ్రీదేవికి కేటాయించారు. అయితే.. శుక్రవారం విడుదల చేసిన జాబితాలో బెల్లంపల్లి స్థానానికి ఎమాజీ పేరును ఫైనల్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. దీంతో.. గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఈ వ్యవహారంపై స్పందించారు. బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థిగా శ్రీదేవే కొనసాగుతారని పేర్కొన్నారు.

వీరితో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లోనేూ అభ్యర్థులు మారారు.గతంలో వనపర్తి స్థానాన్ని అశ్వత్థామ రెడ్డికి కేటాయించారు. తాజాగా ఆయన స్థానంలో అనుజ్ఞారెడ్డి పేరును ఫైనల్ చేశారు. చాంద్రాయణగుట్ట నుంచి సత్యనారాయణకు బదులుగా మహేందర్ కు టికెట్ ఇచ్చారు. వేములవాడ టికెట్ ను తుల ఉమకు గతంలో కేటాయించగా.. తర్వాత వికాస్ రావును బరిలోకి నిలిపారు. ఇలా.. అభ్యర్థుల ఎంపికలో చోటు చేసుకున్న గందరగోళం పార్టీలో పెద్ద చర్చగా మారింది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే పార్టీలో ఇంతటి కన్ఫ్యూజన్ ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News