మండలిలో పెరిగిన ఎన్డీయే బలం.. అయినా వైసీపీదే పైచేయి!
వీరికి పోటీ గా వైసీపీ ఎవరినీ నిలబెట్టకపోవడంతో ఎన్నికల సంఘం ఈ ఇద్దరినీ గెలుపు గుర్రం ఎక్కినట్టుగా ప్రకటించింది.
ఏపీ శాసన మండలిలో టీడీపీ కూటమి బలం పెరిగింది. అయినప్పటికీ.. వైసీపీదే పైచేయిగా సాగనుంది. దీనికి కారణమేంటి? ఎలా ? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం జరిగిన శాసన మండలి పోరులో టీడీపీ నుంచి సీ. రామచంద్రయ్య, జనసేన నుంచి పి. హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరూ ఏకగ్రీవం అయ్యారు. వీరికి పోటీ గా వైసీపీ ఎవరినీ నిలబెట్టకపోవడంతో ఎన్నికల సంఘం ఈ ఇద్దరినీ గెలుపు గుర్రం ఎక్కినట్టుగా ప్రకటించింది. దీంతో మండలిలో తొలిసారి జనసేన ప్రాతినిధ్యం కనిపించింది. ఇదేసమయంలో టీడీపీ ప్రాతినిధ్యం కూడా పెరిగింది.
అయినా కూడా.. వైసీపీ సభ్యులదేపైచేయిగా ఉండనుంది. మొత్తం 58 మంది మండలి సబ్యుల్లో వైసీపీకి 38 మంది సభ్యులు ఉన్నారు. మిగిలిన 20 మందిలో టీడీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. మరొకరు జనసేన అభ్యర్థి తాజాగా ఎన్నికయ్యారు. ఇక, మరో నలుగురు ఉపాధ్యాయ, గ్యాడ్యుయేట్ సభ్యులు ఉన్నారు. ఇతర స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో వైసీపీనే మెజారిటీ సంఖ్య కలిగి ఉంది. దీంతో అసెంబ్లీలో బలం లేకపోయినా.. మండలిలో చంద్రబాబు సర్కారుకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదన్నది తెలిసిందే. ఇదిలావుంటే.. 2025 వరకు సభ్యులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు.
ఈ మధ్య కాలంలో విజయనగరం స్థానిక సంస్థల కోటా కింద ఖాళీ అయిన.. ఒక స్థానానికి ఎన్నిక జరిగే అవకాశంఉంది. అదేసమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కనుక.. గవర్నర్ రేసులో ఉన్న నేపథ్యంలో రాజీనామా చేస్తే.. అప్పుడు మండలిలో టీడీపీకి మరో ఇద్దరు పెరిగే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా.. 2025వ సంవత్సరం వరకు వైసీపీదే పైచేయిగా ఉండనుంది. అయితే.. ఈలోపుటీడీపీ కూటమి ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే.. అప్పుడు.. వైసీపీ నుంచి వలసలు పెరిగి.. మండలిలో పైచేయి.. టీడీపీది అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న మోషేన్ రాజు వైసీపీకి చెందిన నాయకుడనే విషయం తెలిసిందే.