సర్జరీ కోసం వచ్చిన విదేశీ మహిళపై ఆసుపత్రిలో దారుణం
ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
దారుణ ఘటనకు వేదికగా మారింది గుర్ గ్రామ్ లోని ఒక ఆసుపత్రి. చికిత్స కోసం వచ్చిన 51 ఏళ్ల విదేశీ మహిళపై ఆసుపత్రిలో పని చేసే ఉద్యోగి ఒకరు అత్యాచారానికి పాల్పడిన వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు షాక్ కు గురి చేస్తోంది. రేప్ ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్లోకి వెళితే..
కజకిస్థాన్ నుంచి భారత్ కు వచ్చిన ఒక విదేశీ మహిళ గుర్ గ్రామ్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆర్థోస్కోపీ సర్జరీ కోసం తన కుమార్తెతో వచ్చారు. ఇదిలా ఉంటే సదరు మహిళ సర్జరీ అనంతరం మత్తులో ఉన్నారు. ఈ సమయంలో సదరు ఆసుపత్రిలో అటెండెంట్ గా పని చేస్తున్న 24 ఏళ్ల ఠాకూర్ సింగ్ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు.
జులై 9న (మంగళవారం) ఆసుపత్రికి వచ్చిన మహిళకు శనివారం సర్జరీ పూర్తి చేశారు. అనంతరం ఆమెను వార్డుకు తరలించారు. ఆదివారం ఉదయం తన తల్లి వద్దకు వెళ్లిన ఆమె కుమార్తెకు.. అక్కడే ఉన్న ఠాకూర్ సింగ్ ను చూశారు. అనుమానాస్పద తీరుతో పాటు.. అక్కడున్న పరిస్థితిని గుర్తించిన వెంటనే ఆమె భద్రత కోసం అలారాన్ని మోగించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బంది స్పందించారు.
పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఠాకూర్ సింగ్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ దుశ్చర్య షాకింగ్ గా మారింది. దీనిపై మాట్లాడిన ఆసుపత్రి ప్రతినిధులు.. తమ హాస్పిటల్ లో రోగుల భద్రతకే అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు.. జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. నిందితుడ్ని వెంటనే ఉద్యోగం నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదంతం అనంతరం బాధితురాలిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్నారు.